Thursday, May 29, 2014

చంద్రబాబు రెండు పడవల్లో కాళ్ళు తీసి ఒకే పడవలో పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది

చంద్రబాబు గారూ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలని సమదృష్టితో చూడాలనుకోవడం అభినందనీయం. అయితే ఆంద్రప్రదేశ్ కి నష్టం చేకూర్చే అంశాలలో ఈ మీ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది.

అతి వాద తెలంగాణా వాదులు ఆంధ్ర ప్రాంతం వారు తమ వారు కాదు అనుకుంటున్నారు. కేవలం వాళ్ళ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి అన్ని అంశాల మీదా ఎంత అరాచకంగా అయినా మాట్లాడగలుగుతున్నారు. వారికి హక్కు లేని విషయాల్లోనూ అర్థ సత్యాలని, అసత్యాలని ప్రచారం చేసి ప్రయోజనం పొందుతున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలని ఇరుకున పెట్టడానికి తెలంగాణాలో మిగిలిన రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఇతర సంఘాలు అందరూ ఒక్కటైనారు. వాళ్ళ లాగా మీరు విద్వేషం దారిలో వెళ్ళకండి కానీ ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల విషయం లో మాత్రం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణకి ఉద్యోగుల విషయం: మొదట ఆప్షన్స్ ఉండవు అన్న కచరా, తరువాత నాలుక మడతేసి కేవలం అక్రమంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు మాత్రమే వెళ్ళాలి అని చెప్పాను అన్న కచరా, మళ్లీ నాలుక రెండు మడతలేసి ఒక్క సీమాంధ్ర ఉద్యోగి కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని హుంకరిస్తుంటే, దానికి అరాచక వాద బాచ్ అంతా తాళం వేస్తుంటే మీరు గట్టిగా మాట్లడలేకపోతున్నారు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలకి స్థానికత వర్తించదు. అలాగే మిగిలిన కొన్ని ఉద్యోగాల్లో 20% నాన్ లోకల్ కోటా కింద ఉద్యోగం తెచ్చుకుని 20-30 ఏళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా హైదరాబాద్ లో స్థిరపడిన వారిని కేవలం ఇక్కడ చదువుకోలేదు కాబట్టి స్థానికుడు కాదు అని నిర్ధారించి తరమడానికి పూనుకుంటుంటే, అయ్యా వాళ్ళకీ హక్కులుంటాయి అని ఒక్క గొంతుక కూడా అరువు వచ్చిన పాపాన పోలేదు. సచివాలయం లో 90% సీమంద్రులే అని అరాచకవాదులు ప్రచారం చేసి తెలంగాణా ప్రజల్లో విద్వేష విషం నింపి తెలంగాణా సాధిస్తే, లెక్కలు తీసినప్పుడు వారి స్థానిక నిర్వచనం ప్రకారం చూసినా దాదాపు దామాషా ప్రకారం ఉన్నారు అని తేలినప్పుడు కనీసం సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి చర్చ పెట్టె ప్రయత్నం చేయలేదు.  ఏమైనా మాట్లాడితే తెలంగాణాలో పార్టీ ని బద్నాం చేస్తారని భయం.

ఇక పోలవరం సంగతి: ఆంద్రప్రదేశ్ కి చెందిన భద్రాచలం లో కొన్ని మండలాల్ని మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ లోనే కలిపితేనే ఇంత రచ్చ చేస్తున్నారు అతి వాద తెలంగాణా ఉన్మాదులు. డిజైన్ మార్చమని డిమాండ్ - డిజైన్ మార్చి మళ్లీ అనుమతులతో మొదలు పెడితే 100 ఏళ్ళు అయినా పూర్తి కాదు అని తెలియదా.  ఇక మండలాలని కలపడం వల్ల ఇప్పుడు ముంపుకు గురవుతున్న వాళ్లకి దగ్గరలోనే అదే మండలం లోనో, పక్క మండలం లోనో పునరావాసం కల్పించడానికి వీలవుతుంది అనే విషయం వీరికి తెలియనిదా? ప్రతి దాన్ని తెగే దాకా లాగి ప్రజలని భావోద్వేగం లో ఉంచి లబ్ది పొందడానికే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

సీమాంధ్రుల శ్రమతో అభివృద్ది చెంది ఇన్ని ఉపాధి అవకాశాలు, ఆదాయం ఏక పక్షంగా కేవలం భౌగోళిక కారణాలతో తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు. 1956 లో సీమాంధ్ర ప్రాంతం లో భాగమైన భద్రాచలం, మునగాల, అశ్వారావు పేట తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడలేక పోతున్నారు? బహుళ ప్రయోజనాల శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం కర్నూల్ లో అంతర్భాగం అని ఋజువులతో సహా అధికారులు నిరూపించినా దానిపై హక్కుల కోసం పోరాడకుండా ఎందుకు నిష్క్రియాశీలంగా ఉన్నారు? మీరు ఊరుకున్న కొద్దీ అరాచక శక్తులు ఏదో ఒక పనికి మాలిన సమస్యలని సృష్టించి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 ఒక్క విషయం, మీరు మాట్లాడినా బద్నాం చేస్తారు. మాట్లాడకపోయినా బద్నాం చేస్తారు. వాళ్ళ విద్వేష ప్రచారం ముందు మీ సమ న్యాయం  ప్రచారం తేలిపోయిందని ప్రజలే తీర్పిచ్చారు. ఇంకా ఎందుకు దాన్ని పట్టుకు వేలాడతారు? మీరు హైదరాబాద్ ని, తెలంగాణా ని ఎంత అభివృద్ది చేసినా అతివాదులతొ పాటు సామాన్య తెలంగాణా ప్రజలు కూడా ఈ అరాచక శక్తులనే సమర్థించారు. తోటి సోదరులు విభజన వల్ల ఎంత నష్టపోతున్నా, ఇంకా నష్టం కలగ జేయడానికి, అవమానకరంగా మాట్లాడటానికి, తెలంగాణా సీమాంధ్ర మధ్య సంబంధాలు తెగ్గోట్టడానికి  అతివాదులు తెగబడుతున్నా, వారు చేస్తోంది తప్పు అని ఒక్క తెలంగాణా వ్యక్తీ కూడా ముందుకు రాలేదు.  మీకు వచ్చిన సీట్లు కూడా సీమంధ్రులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుండి వచ్చినవె.

కాబట్టి ఇప్పటికైనా ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడాలనుకుంటే రెండు కాళ్ళూ ఒకే పడవలో పెట్టడం అత్యంత అవసరం.

6 comments:

  1. Superb article..

    ReplyDelete
  2. Very true. Some one should talk for true welfare of andhra people not just for sake of politics.
    Naa ch naa should think about it

    ReplyDelete
  3. "సీమాంధ్రుల శ్రమతో అభివృద్ది చెంది ఇన్ని ఉపాధి అవకాశాలు, ఆదాయం ఏక పక్షంగా కేవలం భౌగోళిక కారణాలతో తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు. 1956 లో సీమాంధ్ర ప్రాంతం లో భాగమైన భద్రాచలం, మునగాల, అశ్వారావు పేట తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడలేక పోతున్నారు? బహుళ ప్రయోజనాల శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం కర్నూల్ లో అంతర్భాగం అని ఋజువులతో సహా అధికారులు నిరూపించినా దానిపై హక్కుల కోసం పోరాడకుండా ఎందుకు నిష్క్రియాశీలంగా ఉన్నారు? మీరు ఊరుకున్న కొద్దీ అరాచక శక్తులు ఏదో ఒక పనికి మాలిన సమస్యలని సృష్టించి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు."

    నూటికి నూరు శాతం మీరు చెప్పినది నిజం. ఆంధ్రా నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొకుంటే...13 జిల్లాలకి ద్రోహం చేసిన వారవుతారు.

    ReplyDelete
  4. తన పార్టీని జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలని తహతహ పడుతున్న చంద్రబాబుకి ఇవన్నీ పడతాయా. చంద్రబాబు కూడా కాంగ్రెస్ కు ఏమీ తీసిపోడు. కాంగ్రెస్ వాళ్ళు బయటపడిపొయ్యారు, చంద్రబాబు పడలేదు అంతే. ఆ తానులో గుడ్డ కాదూ! మనకు కూడా గుజరాత్ లో మోడీ లాగా ఒక లీడర్ కావాలి, రాజకీయ నాయకుడు కాదు, కానే కాదు. రాజకీయనాకులు డౌన్ డౌన్, లీడర్ జిందాబాద్

    ReplyDelete
  5. ఈ విషయాలు చంద్రబాబు కు తెలియదంటారా...... మరి అయితే ఇంతవరకు ఆంధ్రప్రాంతంకు జరిగిన అన్యాయంపై ఎందుకు బహిరంగంగా మాట్లాడుటలేదు..... ఇదంతా గమనిస్తుంటే తెలంగాణలో తన పార్టీ కోసం ఆంధ్రావాళ్ళందరిని ముంచేస్తాడేమో.... మోహమాటానికి పోతే అదేదో అదేదో
    అయిందన్నట్లు ఉంది..... మన నేతల వ్యవహారం.....

    ReplyDelete
    Replies
    1. చంద్రబాబుకు ఈ విషయం తెలిసే ఉంటుంది. పరిస్థితులని వాడుకుని రెచ్చగొట్టే రాజకీయాలు చేసి ఉంటె సీమాంధ్ర ప్రజలకి ఆరాధ్యనీయుడు అయి ఉండేవాడు. అలా చేయకుండా రెండు వైపులా తిడుతున్నా సంయమనంతో పెద్ద మనసు చూపించాడు.కానీ అవతల అరాచక వాదులకి అంత సంస్కారం ఉంటె, విడిపోయినా గిల్లి కజ్జాలు కాకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటె రెండు ప్రాంతాల మధ్య మంచి వాతావరణం ఉండేది. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే వాళ్ళతో డీల్ చేయాలంటే కొంత అడ్డంగా వెళ్లక తప్పదు.

      Delete

Comments