Thursday, July 10, 2014

ఆంధ్రప్రదేశ్ - అభివృద్ది నమూనా : చిరునామా


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలతో పోలిస్తే ఇది చాలా చిన్న సమస్య కానీ చిరునామా కోసం ఇప్పుడు  మనం అనుసరిస్తున్న విధానం వల్ల బయటకి కనిపించని నష్టం అపారం.  మనం అనుసరిస్తున్న విధానం లో చిన్న మార్పుతో ఎన్నో లాభాలు పొందొచ్చు. మొదటగా ఏదైనా చిరునామా కోసం వెతుకుతున్నప్పుడు మీకు దాని లోపాలు అవగతం అయ్యే ఉంటాయి. 

ఉదాహరణకి ఈ కింది పటం చూడండి. 


ఇక్కడ చూపించిన ఇల్లు చిరునామా ఉదాహరణకి ఇలా ఉంటుంది. 

వెంకట్ రావు,
16-372/1/A  సాయి రెసిడెన్సీ, అపార్ట్ మెంట్ 12, విజ్ఞేశ్ హైట్స్ వెనకాల, 
సాయిబాబా గుడి పక్కన, పోరంకి , విజయవాడ, కృష్ణా జిల్లా - 521137, ఆంధ్ర ప్రదేశ్

ఆ ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అంబులన్స్ కి ఫోన్ చేశారనుకోండి. అంబులన్స్ ఎలా చేరుకోవాలి? లేదా ఫైర్ ఇంజిన్? లేదా ఎవరైనా ఆ ఇంటి మీద దాడికి వచ్చారు, పోలీస్ కి ఫోన్ చేశారు అనుకోండి. 10 సెకన్ల లో చిరునామా చెప్పాలి ఏమని చెప్తారు? వాళ్ళు ఆ ఇంటికి ఎలా చేరుకుంటారు?  బంధువులే వచ్చారు, ఇంటికి దారి  ఎలా చెప్తారు ?
ఇంకొన్ని దృష్టాంతాలు :

1. ఏదైనా ప్రభుత్వ సేవ (ఉదాహరణకి అంబులన్స్, ఫైర్, పోలీస్ శాఖ,  బీమా, రాయితీలు, జన గణన లాంటివి)  లేదా ప్రైవేటు సేవలు  (బ్యాంకు ఖాతా కి సంబంధించి, లేదా ఏదైనా ఇంటికి వచ్చి చేసే సేవ లాంటివి) ఖచ్చితంగా అమలు కావాలంటే 
2. సేవలు, ఇతర అవసరాల ఖచ్చితమైన సరిహద్దుల కోసం (For ex: Police jurisdiction) 
3. చిరునామా దొరక్క పోవడం వల్ల వ్యాపారాన్ని కోల్పోయే వ్యాపార సంస్థలు
4. తపాలా శాఖ , పార్సెల్ కంపెనీలకి చిరునామా దొరక్క పార్సెల్ వెనక్కి పోవడం, వేరే చోట కి వెళ్ళడం లేదా మిస్ అవ్వడం లాంటి వాటి వల్ల , సరైన సమయానికి చేరకపోవడం వల్ల, మళ్ళీ తిరిగి పంపటానికి అయ్యే ఖర్చులు లాంటివి అపారం. ఈ ఖర్చుని చివరకి వినియోగదారులే భరించాలి. ప్రతి రోజూ కొన్ని మిలియన్ టన్నుల సరుకులు పంపిణీ అవుతుంటాయి. విధిగా రోజూ చేసే వాళ్లకి ఇబ్బంది లేదు కానీ కొత్తగా ఏది ఎక్కడికి పంపిణీ చేయాలన్నా చిరునామా కనుక్కోవడానికి సమయం, ఇంధనం, శ్రమ రూపంలో ఎంతో డబ్బు వృధా.
5. లా ఎంఫోర్సుమెంట్ (ఉదాహరణకి ఒక చలానా పంపాలంటే)
6. కంప్యూటర్ ఆధారిత సేవలు, కంప్యూటర్ ఆధారిత చిరునామా వెతకడం లో సౌలభ్యం (కేవలం ఈ ఒక్క విషయం లో కొన్ని వందల కోట్లు వృథా అవుతున్నాయి అనటం అతిశయోక్తి కాదు)
7. GPS లాంటి వ్యవస్థలు సరైన దారి చూపడానికి

ఇలా ఎన్నో వాటికి మంచి చిరునామా పధ్ధతి ఎంతైనా అవసరం.

మరి చిరునామాకి మంచి పధ్ధతి ఏమిటి? అమెరికాలో ఉన్న పధ్ధతి నాకు బాగా నచ్చింది. జపాన్ దేశ పధ్ధతి కూడా కొంచం మన పధ్ధతి లాగానే ఉంటుంది. తేడా కోసం ఈ వీడియో చూడండి - https://www.youtube.com/watch?v=q1zh49J5rsg

అమెరికా లో ప్రధానంగా రహదారి ఆధారిత చిరునామా పధ్ధతి ఉంది. అది ఇలా ఉంటుంది

వ్యక్తి లేదా సంస్థ పేరు
ఇంటి నెంబర్, వీధి పేరు,
అపార్ట్ మెంట్ నెంబర్ లేదా సూట్ నెంబర్
నగరం, రాష్ట్రం - పిన్ కోడ్.

 ఏ చిరునామా అయినా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. ఉదాహరణకి

గూగుల్ సంస్థ చిరునామా
Google Inc
1600 Amphitheatre Pkwy,
Mountain View, CA - 94043    
మైక్రోసాఫ్ట్ చిరునామా
Microsoft Corporation 
One Microsoft Way 
Redmond, WA - 98052    
పేస్ బుక్ చిరునామా 
Facebook Inc 
1601 Willow Rd, 
Menlo Park, CA - 94025    

ఈ పద్ధతిలో ప్రధానాంశాలు
1. ఒక  రాష్ట్రం లో ఒక పేరుతొ ఒకే నగరం.
2. ఒక నగరం లో ఒక పేరుతొ ఒకే వీధి
3. ఒక వీధి లేదా రహదారి మొదలు అయిన చోటు నుండి ఒక వైపు సరి సంఖ్య, రెండో వైపు బేసి సంఖ్యతో ఇళ్ళ అంకెలు (దీని వల్ల ఒక వీధిలో ఇంటి సంఖ్య 1331 కోసం వెతుకుతున్నాం అనుకోండి ఒక వైపే చూసుకుంటూ వెళ్ళొచ్చు. పైగా క్రమ పద్ధతిలో ఉంటాయి కాబట్టి కనుక్కోవడం సులభం)


4. పక్క పక్కన ఉన్న ఇళ్ళ అంకెల మధ్యలో ఎడం (ఉదాహరణకి 100, 200 అలా. దీని వల్ల రెండిటి మధ్యలో ఇంకో ఇల్లు కట్టినా 150 అని పెట్టుకోవచ్చు. ఇళ్ళ అంకెలు క్రమ పధ్ధతి లోనే ఉంటాయి.)
5. ప్రతి ఇల్లు లేదా వ్యాపార భవనం ముందు విధిగా వీధిలోకి కనిపించే విధంగా ఇంటి సంఖ్య అమర్చాలి.

ఇంకో ముఖ్య అంశం చిరునామాలో జిల్లా లేకపోవడం మీరు గమనించొచ్చు. అమెరికా లో ప్రతి రెండు వీధులు కలిసే చోట వీధి నామాలతో కింది విధంగా బోర్డులు ఉంటాయి.


వీధి నామం సూచించే బోర్డుమీద ఇంటి సంఖ్య సూచనలు కూడా ఛాలా చోట్ల ఉంటాయి. ఉదాహరణకి  " 4500 Kaphan Ave 4600" ఉందనుకోండి ఒక వైపు వెళితే 4600 నుండి పైన సంఖ్య గల ఇళ్ళు ఉన్నట్టు. ఇంకో వైపు 4500 కంటే తగ్గుతూ పోయే ఇంటి  సంఖ్యలు ఉన్నట్టు.

అమెరికా లోని జార్జియా రాష్ట్ర చిరునామా కోసం ఆ రాష్ట్రం అనుసరించే ప్రమాణాలు, మార్గదర్శకాలు -
http://www.emerycounty.com/addressing/102004-addressguide_draft.pdf

ఈ మధ్యే కొరియాలో  చిరునామా విధానాన్ని మార్చారు. వివరాల కోసం - https://www.youtube.com/watch?v=CkYnR5BFewI

ఇలాంటి ఒక  ప్రామాణికాన్ని తీసుకుని దేశమంతటా అమలు చేస్తే బాగుంటుంది. 

Monday, June 23, 2014

ఆంధ్రప్రదేశ్ - అభివృద్ది నమూనా : ఆపత్కాల సమాచార వ్యవస్థ


ఉపోద్ఘాతం

రాష్ట్రం విడిపోయింది. ప్లస్ లన్నీ తెలంగాణాకి మైనస్ లన్నీ AP కి వేసి వదిలిపెట్టారు కేంద్రం పెద్దలు. అప్పుల్లో ఉదారంగా భాగం ఇచ్చారు.ఆస్థులొచ్చేసరికి మీవి కాదు పొమ్మన్నారు. రాజధాని లేకుండా, CM, మంత్రులు, ఉద్యోగులు ఎక్కడ కూర్చోవాలో తెలియకుండా చివరికి గోచి గుడ్డ మిగిల్చారు. సరే జరిగిందేదో జరిగింది. చంద్రబాబు చెప్పినట్టు కుంగిపోకుండా సమస్యలోనే ఒక అవకాశం చూసి అంతకు మునుపు కంటే ఎక్కువ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. మనకున్న వనరులను, శక్తి సామర్థ్యాలను కూడదీసుకుని ప్రణాళికా బద్దంగా అభివృద్ది చెందవలసిన సమయమిది. 

మన ప్రస్థానం మొదటి నుండి మొదలుపెట్టాల్సి ఉంది. ఈ సమయంలో మంచి అభివృద్ది నమూనా ఎక్కడున్నా అనుసరించి ఒక పధ్ధతి ప్రకారం అభివృద్ది చేస్తే భవిష్యత్ తరాలకి మేలు చేసిన వాళ్లవుతాము. కొన్ని సార్లు ఆలోచిస్తే అసలు మన అధికారులకి, నాయకులకి బుర్ర పని చేస్తోందా అనే అనుమానం కలుగుతుంది.ప్రతి నాయకుడు, అధికారి వేరే దేశానికి ఒక్క సారైనా వెళ్లి ఉంటాడు. అక్కడ పరిసరాలని గమనిస్తే అక్కడ ట్రాఫిక్ క్రమ పద్ధతిలో అంత స్పీడ్ గా  ఎలా వెళ్తోంది ? రోడ్లు గుంటలు లేకుండా ఎలా ఉన్నాయి? మురుగు నీరు కంపు ఎందుకు రావట్లేదు ఇలా ఒక్కొక్క  ప్రశ్న వేసుకున్నా ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికేది. కనీసం కాపీ కొట్టి కూడా నేర్చుకోవడం రాకపోతే ఏమనాలి? పాశ్చాత్యదేశాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అభివృద్ది చెందిన దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో నా దృష్టికి వచ్చిన మంచి  నియమాలు, నిబంధనలు, అలవాట్లు, వ్యవస్థల గురించి పంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఇలాంటివి  మీ దృష్టికి ఏమైనా వస్తే దయచేసి పంపండి. ఈ బ్లాగ్ లో ప్రచురిస్తాను. ఈ సిరీస్ లో మొదటిది - 

ఆపత్కాల సమాచార వ్యవస్థ (Emergency messaging system)

బియాస్ నది దుర్ఘటన - ఇది చాలా దురదృష్టమైన సంఘటన. చిన్న ప్రయత్నం తో వారించతగిన (avoidable) సంఘటన. ఇది జరిగిన కొన్ని రోజులకి అమెరికాలో నేనున్న ప్రదేశం లో వర్షం పడుతోంది. ఆఫీసు నుండి బయలుదేరుతుండగా ఒక మెసేజ్ వచ్చింది. ఇది ఆ మెసేజ్ 


ఈ ఏరియాలో వర్షం వల్ల  అనుకోని వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ప్రాంతాలని వారించండి అని ఆ మెసేజ్ సారాంశం. ఇది ఎక్కడైతే ప్రమాదం ఉందొ ఆ ఏరియా సెల్ టవర్ పరిధి లో ఉన్న అన్ని సెల్ ఫోన్ లకి పంపుతారు. ఎంత సులభమైన పరిష్కారం? 

ఇవ్వాళ దాదాపు ప్రతి ఒక్కరి దగ్గరా సెల్ ఫోన్ ఉంది. చేయాల్సిందల్లా అధికారులు సెల్ ఆపరేటర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందొ ఆ సెల్ టవర్ పరిధిలో ఉన్న సెల్ ఫోన్ లన్నిటికీ మెసేజ్ పంపడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అలాంటి వ్యవస్థ ఉండి ఉంటె 25 నిండు ప్రాణాలు బలైపోయేవి కాదు. కనీసం ప్రమాదం జరిగిన తరువాత అయినా మేలుకుని అన్ని ఆనకట్టల వద్ద ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి నీరు వదిలే ముందు కింద ఒక 10 కిలో మీటర్ల  పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్న సెల్ ఫోన్ లన్నిటికీ ఇలాంటి మెసేజ్ పంపితే చాలా ప్రాణాలు కాపాడొచ్చు. ఇదే కాదు ఇక్కడ పోలీస్లకి దొరకకుండా తప్పించుకున్న వాహనాల నెంబర్ లు లేదా వాహనాలు తస్కరించినా కూడా ఆ చుట్టు పక్కల ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ లకి  మెసేజ్ చేస్తారు, కనిపిస్తే పోలీస్ లకి తెలపమని. 

అధికారులకి తెలిసి ఆనకట్ట గేట్లు ఎత్తారు కాబట్టి ఇలాంటి సంఘటనల్లో ఇలాంటి వ్యవస్థ ఉపకరిస్తుంది. మరి అనుకోకుండా కొండల్లో నుండో, ఉపనదుల నుండో మొన్న ఉత్తరాఖండ్ లో వచ్చిన లాంటి వరదలు వస్తే ? దానికి సులభమైన పరిష్కారం - ఎక్కడైతే అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందో ఉదాహరణకి ఒక ఉప నది ఒక నదిలో కలిసే చోటు నుండి అక్కడక్కడా నీరు ఒక నిర్దేశిత ఎత్తుకు రాగానే నివేదించే ఎలక్ట్రానిక్ పరికరాలు పెట్టి వాటిని సంబంధిత రివర్ అథారిటీ ఆఫీసుకి అనుసంధానిస్తే సరిపోతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కావాల్సిందల్లా పరిష్కారాన్ని అన్వేషించి దాన్ని చిత్త శుద్ధితో అమలు చేయడమే. 

ఉదాహరణకి ఈ లింక్ చూడండి - http://embedded.asti.dost.gov.ph/projects/water-level-monitoring-system/

ఇలాంటి పరిష్కారాలు ఇంజనీరింగ్ విద్యార్థులే అలోచించి ఒక పరికరాన్ని కనుక్కోవచ్చు. చివరికి వెస్ట్రన్ టాయిలెట్స్ ఫ్లష్ లో వాడే టెక్నాలజీ వాడైనా ఒక పరికరం తయారు చేయోచ్చు.మన రాష్ట్రంలోనే కొన్ని వందల సాంకేతిక విద్యా సంస్థలున్నాయి. ప్రతీ కాలేజీ డిపార్టుమెంటు నుండి సంవత్సరానికి ఒక్క సమస్యకి పరిష్కారం కనుగొన్నా మనం టెక్నాలజీ కోసం వేరే దేశాల మీద ఆధారపడే అవసరం ఉండదు. 

సమస్య వచ్చిన ప్రతిసారీ అప్పటికప్పుడు కంటి తుడుపు చర్యలు చేపట్టకుండా శాశ్వత పరిష్కార మార్గాలు అలోచించి బియాస్ నది దగ్గర జరిగింది కాబట్టి అక్కడ మాత్రమె కాకుండా, ఎక్కడ ఇలాంటి పరిస్థితులున్నాయో అన్ని చోట్లా అమలు చేస్తే ఎన్నో ప్రాణాలని కాపాడొచ్చు . 







Sunday, June 22, 2014

విభజన విషఫలాలు - తెలంగాణావాదుల అరాచకత్వం

కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజిస్తూ ఉంటె అడ్డు చెప్పిన ప్రతి వాడి మీదా రాళ్ళేశారు విభజన వాదులు. హైదరాబాద్, నీళ్ళు, కరెంటు, భద్రాచలం అంశాలు తేల్చటం చాల కష్టం అంటే నవ్వుకున్నారు. చంద్రబాబు సమ న్యాయం అంటే  గేలి చేశారు. కానీ ఇప్పుడు ఇవే బండలై కూర్చున్నాయి. ఈ అస్తవ్యస్త విభజనతో ప్రతి ఆంధ్రుడి గుండె తీవ్రంగా గాయపడింది. దాన్ని తెలంగాణా వాదులు  వాళ్ళ మాటలతో, చేతలతో ఇంకా కెలికి కారం పూసినట్టు ఉంది. ఇప్పటికి తెలంగాణా వాదులకి చాలా ఆనందంగా ఉండొచ్చు. కానీ ముందు ముందు తెలుస్తుంది దాని ప్రభావం. నేనొక జాతీయ వాదిని. ఇన్ని రోజులు మా స్వచ్చంద సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది విద్యార్థులకి ప్రాంతీయ భేదం లేకుండా సాయం చేసాం. కానీ నా వరకు ఇక నుండి ఆ పరిస్థితి ఉండదు. నన్ను నా జాతిని అవమానపరిచి, విడిపోయినందుకు సంబరాలు చేసుకునే జాతి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఇక విభజన విష ఫలాలకి వస్తే

హైదరాబాద్
ఇది అన్ని సమస్యలకి  మూల కారణం అవుతోంది. వెనకా ముందూ ఆలోచించకుండా 58 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని కేవలం భౌగోళిక కారణాలతో అన్ని హక్కులూ ఒకే ప్రాంతానికి ధారాదత్తం చేయడం కాంగ్రెస్ పెద్దల మేధావితనానికి నిదర్శనం. దానికి శల్య సారధ్యం చేసిన మన కాంగ్రెస్ నాయకులని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలా ధారాదత్తం చేయడం వాళ్ళ వచ్చిన సమస్యలు

1. ఆదాయం:  రాష్ట్ర రాజధాని కావటం ఎన్నో సంస్థలు, వ్యాపారాలు నెలకొల్పబడ్డాయి. వాటన్నిటి మీద ఒక్కసారిగా  హక్కు కోల్పోయాం. ఆస్థిపై, ఆదాయం పై హక్కు కోల్పోయాం. దీని వల్ల తెలంగాణా మిగులు రాష్ట్రం అయితే ఆంధ్ర ప్రదేశ్ లోటు  బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది. పైగా ఈ సంస్థలన్నీ రావడానికి కారణం రాష్ట్రానికి రాజధాని అని లేదా ముఖ్యమంత్రుల వల్ల లేదంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు మాది అనుకుని పెట్టుబడి పెట్టడం వల్ల.మెజారిటీ  ఆదాయం రావడానికి కారణం డైరెక్ట్ గా కానీ ఇన్డైరెక్ట్ గా కానీ సీమాన్ద్రులే కారణం. హైదరాబాద్ ఆదాయానికి తెలంగాణా వాళ్ళ పాత్ర నామ మాత్రం. IT, విద్య, వైద్యం, సినిమా, ఫార్మా, మౌలిక సదుపాయాలు ఇలా ఏ రంగం తీసుకున్నా సీమాంధ్రుల పాత్రే అధికం. కానీ ఒక్క దెబ్బతో సీమాంధ్రుల 58 ఏళ్ళ మొత్తం శ్రమని తెలంగాణా కి దోచి పెట్టారు. పైగా సీమంద్రులే మమ్మల్ని దోచుకున్నారు అని ముద్ర కొట్టి మరీ పంపిస్తున్నారు. సీమంధ్రులు వద్దు కానీ వారు సృష్టించిన సంపద మాత్రం కావాలి. ఇదీ తెలంగాణా అరాచకవాదుల  ఆత్మగౌరవం. 

2. స్థానికత : మాది అనుకుని తమ సొంత ఊర్లతో అన్ని బంధాలూ తెంచుకుని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారి గుండె మంట ఎవరికి అర్థం అవుతుంది? ఇదే ప్రశ్న అడిగితే హైదరాబాద్ లో ఉన్నోల్లంతా హైదరాబాదోల్లె, ఎవరినైనా వెల్లమన్నమా అని మీడియా ముఖంగా బ్లాగుల్లో కారు కూతలు కూసారు అరాచక వాదులు. ఇప్పుడెం చేస్తున్నారు.

విద్యార్థులు:

తండ్రి తెలంగాణాలో పుడితేనే స్థానికుడట. ఎంత అరాచకం. 

దేశమంతా 4 ఏళ్ళు ఒక చోట చదివితే స్థానికుడు అవుతాడు. లేదా 7 ఏళ్ళు ఒక చోట ఉంటె స్థానికుడు అవుతాడు. కానీ తెలంగాణాలో మాత్రం ఒక ఇంజనీరింగ్ చదువుతున్న వ్యక్తి వాళ్ళ నాన్న 2 ఏట ఇక్కడికి వచ్చి స్థిర పడ్డా (అంటే దాదాపు 40 ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నా) ఆ ఇంజనీరింగ్ చదివే అబ్బాయి స్థానికుడు కాదు. ఎంత అరాచకం. తెలంగాణా వాదులకి ఇప్పుడు చట్టాలూ, రాజ్యాంగాలూ గుర్తుకు రావు. ఇది తప్పు అని కనీసం ఒక ఖండన కూడా ఉండదు.

చివరికి వేరే దేశం అమెరికాలో, అక్కడ పుడితే తల్లి తండ్రి ఎక్కడి వాళ్ళు, ఎన్ని రోజుల నుండి ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా పౌర సత్వం వస్తుంది. అమెరికన్లతో సమానంగా హక్కులు, ప్రయోజనాలు పొందొచ్చు. లేదా అమెరికన్ అబ్బాయిని కాని అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే 4 ఏళ్ళలో పౌరసత్వం వస్తుంది.లేదా ఉద్యోగ పరంగా అక్కడికి వెళ్లి స్థిర పడితే 12 ఏళ్లలో లేదా 15 ఏళ్ళలో అక్కడి పౌరసత్వం వస్తుంది. కానీ ఇన్ని రోజులు సొంత రాష్ట్రం, మన దేశం లో 40 ఏళ్ళు ఒక కుటుంబం ఒక చోట స్థిర పడ్డా స్థానికుడు కాదు అంటే ఇంకేమనాలి? వాళ్ళకి రావలసిన హక్కులు, ప్రయోజనాలు నిరాకరిస్తుంటే ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశం లో, ఇన్ని వ్యవస్థల్లో ఒక్కటి కూడా ఈ అరాచకాన్ని అడ్డుకోలేక పోతోంది. చివరకి దేశ విభజన జరిగిన సమయంలో కూడా తండ్రి ఇక్కడ పుట్టి ఉంటేనే స్థానికుడు అన్న నిబంధన పెట్టలేదు. అలా పెట్టి ఉంటే మన దేశానికి హోం మంత్రిగా పని చేసి రేపో మాపో రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్న లాల్ కృష్ణ అడ్వానీ గారు స్థానికుడు అయి ఉండేవాడు కాదు. ఎందుకంటే అడ్వానీ గారు జన్మించింది పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో. 

ఈ సమయం లో నాకు అమృత సినిమాలోని  ఒక పాట గుర్తుకు వస్తోంది - http://www.raaga.com/player5/?id=6685

ఇక్కడ 40 ఏళ్ళ నుండి లేడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందడు  అని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనలేదు దానికి ధన్యవాదాలు. కానీ ఏ మహా రాష్ట్ర నుండో, ఒరిస్సా నుండో 40 ఏళ్ళ క్రితం కార్మికుడిగా వచ్చి స్థిరపడ్డ వాళ్ళ పిల్లల సంగతేంటి?

ఉద్యోగస్థులు:
వీరి పరిస్థితి కూడా దయనీయం. ఉద్యోగరీత్యా ఉన్న ఊరు వదిలి, అన్ని ఆస్తులు అమ్ముకుని ఇక నుండి ఇది మా నగరమే అనుకుని దశాబ్దాలుగా ఆర్ధిక, సామాజిక బంధాలన్నీ ఇక్కడే ఏర్పరుచుకున్న వాళ్ళని వెళ్లగొట్టే ప్రక్రియకి పూనుకున్న వాళ్ళని ఏమనాలి. 6 పాయింట్ ఫార్ములా ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం అక్రమంగా ఉన్న ఎవరైనా  - తెలంగాణా వారితో సహా వెళ్ళగొడితే, అక్రమంగా వచ్చాడు కాబట్టి అలా చేశారు అనుకోవచ్చు. చట్ట బద్దంగా ఉద్యోగం తెచ్చుకుని ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళని వెళ్ళగొట్టాలని చూడటం దుర్మార్గం. న్యాయంగా తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్న వాళ్లకి ఆప్షన్లు ఇచ్చి వాళ్ళ ఇష్టమొచ్చిన చోట పనిచేసుకునే హక్కు ఉద్యోగులకి ఉంది. కానీ  తమ తెలబాన్ చట్టాన్ని అమలు చేయాలనీ ముందు నుండే బెదిరించి అభద్రత కి గురి చేసి వారికి వారే వెళ్ళిపోతాం అనేలా చేస్తున్నారు.

స్థానికత కి 6పాయింట్ ఫార్ములా ప్రెసిడెంట్ ఆర్డర్ లో ఇచ్చిన నిర్వచనం ఇదీ

A local candidate has been defined with reference to the period of study for four years prior to the date of his appearance at the qualifying examination or matriculation, whichever is lower, in a local area and in cases where no qualification is prescribed, with reference to the residence for four years of the candidate prior to the date of notification of the vacancy. If a candidate is not a local candidate by virtue of 4 years study or residence, as the case may be, he would be a local candidate with reference to the major period of study/residence in a local area within a period of 7 years before the qualifying examination or matriculation, whichever is lower or the date of notification of vacancy, as the case may be. Detailed instructions in this regard have been issued in G.O.P.No. 729, GAD, dated 1.11.75 and G.O.Ms.No.186, GAD, dated: 18.3.1977"

ఇక ఇవ్వాళే వచ్చిన వార్త - గాంధీ వైద్యులు AP అసెంబ్లీ సమావేశాలకి వైద్యులుగా విధులు నిర్వర్తించడానికి  వెళ్ళము అన్నారట. ఇలా ప్రతి విషయం లో అవమానం, వివక్ష. అంతటికీ కారణం కాంగ్రెస్ అపర మేధావులు. చచ్చేదాకా ఈ 'మేలు'ని మర్చిపోవద్దు.

హైదరాబాద్ విషయంలో ఒకే ఒక పరిష్కారం - UT లేదా ప్రత్యెక రాష్ట్రం చేయడం.  దేశం లో ఉండే స్థానికత నిర్వచనం ఆధారంగా స్థానికులకి పెద్ద పీట వేసి మిగిలిన ప్రాంతాలకి జనాభా నిష్పత్తిలో కొన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం. UT చేస్తే అనవసరంగా ఎవరికీ కాకుండా పోతుంది అని ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఉంటె మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు అరాచకవాదులు.  UT చేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ కోల్పోయిన ఆదాయం రాకపోయినా ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు  అభద్రత, అవమానాలకి గురి కాకుండా ఉంటారు. సెకండ్ రేటెడ్ సిటిజెన్ లాగా బతకాల్సిన అవసరం అంత కంటే ఉండదు.

భద్రాచలం 
మాకు 1956 కంటే ముందు ఉన్న తెలంగాణా తప్ప ఒక్క అంగుళం ఎక్కువ వద్దు అని ఎన్నో సార్లు తెలబాన్ నాయకులు మీడియా గొట్టాల ముందు గొంతు చించుకుని అరిచారు. కానీ విభజన దగ్గరకి వచ్చేసరికి ఠాట్ కుదరదంటే కుదరదు అని పేచీ పెట్టుకున్నారు. భద్రాద్రి గుడి మా రాజు డబ్బులతోనే కట్టాడు అని ఒకడంటే, పోలవరం కట్టి మా గిరిజనుల పొట్ట కొడతారా అని ఇంకొకడు. మొత్తం భద్రాచలం కలపకుండా కేవలం ముంపు మండలాలు కలుపుతాం అన్నా పేచీ. మా గిరిజనుల పొట్ట కొడతారా అని. అయ్యా, మా రాష్ట్రం లో పునరావాసం గురించి మేము చూసుకుంటాం మీకెందుకు నొప్పి. పోనీ వాళ్ళు మీ వాళ్ళే అనుకుంటే తెలంగాణా విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా ఫీజులు కడతాం అన్నట్టు గిరిజనులకి కూడా మీరే పునరావాసం కల్పించండి అంత ప్రేమ ఉంటె ఎవరొద్దన్నారు? లేదంటే భద్రాచలం డివిజన్ లోనే వేరే మండలాల్లో పునరావాసం కల్పిస్తాం అని చెప్పండి సరిపోతుంది. ఇవన్నీ చేయరు ఆ మీ రాష్ట్రం లో  ప్రాజెక్ట్ కి మేమెందుకు పునరావాసం కల్పిస్తాం అంటారు. మరదే  చెప్పేది. మా రాష్ట్రం లో పునరావాసం గురించి మీకెందుకు అనే. వాస్తవం ఏమంటే ఆ మండలాలు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపితే ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్ర ప్రదేశ్ కె చెందుతుంది. పొరపాటున పోలవరం కడితే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది చెందుతుంది అనే కుళ్ళు కుతంత్రమే కానీ వాళ్ళు చేసే వాదన అర్థ రహితం అని వాళ్ళకు మాత్రం తెలీద ఏంటి.

ఈ విషయం లో వార్తలు వస్తున్నట్టు 1956 ముందు ఉన్న ప్రదేశాలు (భద్రాచలం,  మునగాల,అశ్వారావు పేట) డివిజన్ లన్నీ ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలి.

నీళ్ళు 
దీనిపై ఇప్పటికే వివాదం మొదలైంది. పై రాష్ట్రం కాబట్టి ఏమైనా చేయోచ్చు అనుకుంటున్నారు. తమ వాటా ప్రకారం రావాల్సిన 10 TMC ల తాగు నీటిని విడుదల చేయమంటే ఫైల్ ని తొక్కి పెట్టి కూర్చున్నాడు తెలబాన్ నాయకుడు. నీళ్ళ వివాదాలు వస్తాయంటే రాష్ట్రీయ, దేశీయ, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులెం ఉండవు అని గొంతు చించుకున్న వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు. కాస్త గొంతు విప్పి చట్టాలని అక్షరం తో సహా పాటించాలానే తెలంగాణా వాళ్ళే ఎందుకు ఆ చట్టాలు పాటించ లేదో చెప్తే కాస్త విని తరించాలని ఉంది. 

విద్యుత్ 
మాకు కావాల్సిన విద్యుత్ మేము బ్రహ్మాండంగా స్పీడ్ అప్ చేసి ఉత్పత్తి చేసుంటాం అన్నోళ్ళకి AP విద్యుత్తో  ఏమి అవసరం వచ్చింది? ఇదే మాట కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే కిండల్ చేశారు.పునర్విభజన చట్టం లో ఇప్పటికి అమల్లో ఉన్న విద్యుత్ ఒప్పందాల్లో 54% తెలంగాణా కి ఇవ్వాలి అని పెట్ట్టాలని ఏ మేధావికి ఐడియా వచ్చిందో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి.

లక్కీ గా ఇప్పటికి ఒప్పందాలు ఏవి అమల్లో లేవు. కాబట్టి AP లో ప్రొడ్యూస్ అయ్యే విద్యుత్ ఆ నిష్పత్తి లో ఇవ్వక్కర్లేదు. ERC అప్రూవ్ చేయని ఒప్పందాలని AP జెన్కో పాటించాల్సిన అవసరం లేదు. ఇక ఎవరో ఒక పాయింట్ లాగారు. ERC కి కొత్త ఒప్పందాలు పంపిన నాటి నుండి కొత్త టారిఫ్ లు అమలు అవుతున్నాయి కాబట్టి ఒప్పందాలు అమలైనట్టే అని. అదే ERC రాష్ట్ర విభజన తరువాత రెండు జెన్కో లకి డిస్కం లతో కొత్త ఒప్పందాలు చేసుకుని కొత్త టారిఫ్ లు పంపండి అని చెప్పింది. అదే లాజిక్ ప్రకారం అంతకు ముందు ఒకవేళ ఏవైనా ఒప్పందాలు అమల్లో ఉన్నా చెల్లనట్టే కదా. ఏ రకంగా చూసినా ఏ సెక్షన్ లు ప్రయోగించాకుండానే AP విద్యుత్ AP కె చెందుతుంది. ఇప్పుడు మాత్రం కుట్ర అది ఇది అని వాగుతున్నారు.

వీటన్నిటి పైనా కచరా మాట్లాడిన మాటలు - https://www.youtube.com/watch?v=kQzYDus5BrI

Sunday, June 1, 2014

అరాచక శక్తులే గెలిచాయి!






అరాచక శక్తులే గెలిచాయి. ఇంకొన్ని గంటల్లో తెలుగు నేల రెండుగా చీలబోతోంది. విద్వేషం ముందు పాలు నీళ్ళలా కలిసిపోయిన తెలుగుజాతి తలొంచి ఓడిపోయింది.  గుప్పెడు మంది పద్దతిగా వేరు చేస్తే ఏ జాతిని అయినా విడగొట్టొచ్చు అని నిరూపించాడు తెలబాన్ నాయకుడు.

1956లో తెలంగాణా మొత్తం లో గుంటూరు లో ఉన్న స్కూల్స్ అయినా లేని స్థాయి నుండి, పటేల్ , పట్వారిలని బాంచన్ కాల్మొక్తా అనే స్థాయి నుండి, వ్యసాయం చేయాలంటే పక్క ప్రాంతం వాళ్ళు వచ్చి చేయాలి అనే స్థాయి నుండి అన్ని విషయాలలో పోటీ పడగలిగే స్థాయికి రావడానికి తమ స్నేహ హస్తం అందించి , తమ శక్తి ని ధారపోసిన తోటి సోదరులను దొంగలుగా, దోపిడీ దారులుగా ముద్ర వేసి, జాతి మధ్య వైరుధ్యాల విషం నింపి,  అన్నం పెట్టిన చేతినే నరికి , ఒప్పందాలు అమలు చేయలేదు అని ఏడ్చిన వాళ్ళు ఇంకా రాష్ట్రం ఏర్పడకముందే దళిత హామీని తుంగలో తొక్కి,  ఇక్కడే పుట్టినా నా వాళ్ళు కాదు అనగలిగే కుత్సిత బుద్ది కల వాళ్ళు,  అరాచక వాదులు, దౌర్జన్య వాద తెలబానులు తెలుగు నేలను ముక్కలు చేసి, రాజ్యాధికారం చేపట్టడాన్ని నిరసిస్తూ --

మీరు నాతో ఏకీభవిస్తే మీ నిరసనని ఏ రూపం లో అయినా గట్టిగా తెలియజేయండి.



Thursday, May 29, 2014

చంద్రబాబు రెండు పడవల్లో కాళ్ళు తీసి ఒకే పడవలో పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది

చంద్రబాబు గారూ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలని సమదృష్టితో చూడాలనుకోవడం అభినందనీయం. అయితే ఆంద్రప్రదేశ్ కి నష్టం చేకూర్చే అంశాలలో ఈ మీ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది.

అతి వాద తెలంగాణా వాదులు ఆంధ్ర ప్రాంతం వారు తమ వారు కాదు అనుకుంటున్నారు. కేవలం వాళ్ళ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి అన్ని అంశాల మీదా ఎంత అరాచకంగా అయినా మాట్లాడగలుగుతున్నారు. వారికి హక్కు లేని విషయాల్లోనూ అర్థ సత్యాలని, అసత్యాలని ప్రచారం చేసి ప్రయోజనం పొందుతున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలని ఇరుకున పెట్టడానికి తెలంగాణాలో మిగిలిన రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఇతర సంఘాలు అందరూ ఒక్కటైనారు. వాళ్ళ లాగా మీరు విద్వేషం దారిలో వెళ్ళకండి కానీ ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల విషయం లో మాత్రం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణకి ఉద్యోగుల విషయం: మొదట ఆప్షన్స్ ఉండవు అన్న కచరా, తరువాత నాలుక మడతేసి కేవలం అక్రమంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు మాత్రమే వెళ్ళాలి అని చెప్పాను అన్న కచరా, మళ్లీ నాలుక రెండు మడతలేసి ఒక్క సీమాంధ్ర ఉద్యోగి కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని హుంకరిస్తుంటే, దానికి అరాచక వాద బాచ్ అంతా తాళం వేస్తుంటే మీరు గట్టిగా మాట్లడలేకపోతున్నారు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలకి స్థానికత వర్తించదు. అలాగే మిగిలిన కొన్ని ఉద్యోగాల్లో 20% నాన్ లోకల్ కోటా కింద ఉద్యోగం తెచ్చుకుని 20-30 ఏళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా హైదరాబాద్ లో స్థిరపడిన వారిని కేవలం ఇక్కడ చదువుకోలేదు కాబట్టి స్థానికుడు కాదు అని నిర్ధారించి తరమడానికి పూనుకుంటుంటే, అయ్యా వాళ్ళకీ హక్కులుంటాయి అని ఒక్క గొంతుక కూడా అరువు వచ్చిన పాపాన పోలేదు. సచివాలయం లో 90% సీమంద్రులే అని అరాచకవాదులు ప్రచారం చేసి తెలంగాణా ప్రజల్లో విద్వేష విషం నింపి తెలంగాణా సాధిస్తే, లెక్కలు తీసినప్పుడు వారి స్థానిక నిర్వచనం ప్రకారం చూసినా దాదాపు దామాషా ప్రకారం ఉన్నారు అని తేలినప్పుడు కనీసం సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి చర్చ పెట్టె ప్రయత్నం చేయలేదు.  ఏమైనా మాట్లాడితే తెలంగాణాలో పార్టీ ని బద్నాం చేస్తారని భయం.

ఇక పోలవరం సంగతి: ఆంద్రప్రదేశ్ కి చెందిన భద్రాచలం లో కొన్ని మండలాల్ని మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ లోనే కలిపితేనే ఇంత రచ్చ చేస్తున్నారు అతి వాద తెలంగాణా ఉన్మాదులు. డిజైన్ మార్చమని డిమాండ్ - డిజైన్ మార్చి మళ్లీ అనుమతులతో మొదలు పెడితే 100 ఏళ్ళు అయినా పూర్తి కాదు అని తెలియదా.  ఇక మండలాలని కలపడం వల్ల ఇప్పుడు ముంపుకు గురవుతున్న వాళ్లకి దగ్గరలోనే అదే మండలం లోనో, పక్క మండలం లోనో పునరావాసం కల్పించడానికి వీలవుతుంది అనే విషయం వీరికి తెలియనిదా? ప్రతి దాన్ని తెగే దాకా లాగి ప్రజలని భావోద్వేగం లో ఉంచి లబ్ది పొందడానికే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

సీమాంధ్రుల శ్రమతో అభివృద్ది చెంది ఇన్ని ఉపాధి అవకాశాలు, ఆదాయం ఏక పక్షంగా కేవలం భౌగోళిక కారణాలతో తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు. 1956 లో సీమాంధ్ర ప్రాంతం లో భాగమైన భద్రాచలం, మునగాల, అశ్వారావు పేట తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడలేక పోతున్నారు? బహుళ ప్రయోజనాల శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం కర్నూల్ లో అంతర్భాగం అని ఋజువులతో సహా అధికారులు నిరూపించినా దానిపై హక్కుల కోసం పోరాడకుండా ఎందుకు నిష్క్రియాశీలంగా ఉన్నారు? మీరు ఊరుకున్న కొద్దీ అరాచక శక్తులు ఏదో ఒక పనికి మాలిన సమస్యలని సృష్టించి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 ఒక్క విషయం, మీరు మాట్లాడినా బద్నాం చేస్తారు. మాట్లాడకపోయినా బద్నాం చేస్తారు. వాళ్ళ విద్వేష ప్రచారం ముందు మీ సమ న్యాయం  ప్రచారం తేలిపోయిందని ప్రజలే తీర్పిచ్చారు. ఇంకా ఎందుకు దాన్ని పట్టుకు వేలాడతారు? మీరు హైదరాబాద్ ని, తెలంగాణా ని ఎంత అభివృద్ది చేసినా అతివాదులతొ పాటు సామాన్య తెలంగాణా ప్రజలు కూడా ఈ అరాచక శక్తులనే సమర్థించారు. తోటి సోదరులు విభజన వల్ల ఎంత నష్టపోతున్నా, ఇంకా నష్టం కలగ జేయడానికి, అవమానకరంగా మాట్లాడటానికి, తెలంగాణా సీమాంధ్ర మధ్య సంబంధాలు తెగ్గోట్టడానికి  అతివాదులు తెగబడుతున్నా, వారు చేస్తోంది తప్పు అని ఒక్క తెలంగాణా వ్యక్తీ కూడా ముందుకు రాలేదు.  మీకు వచ్చిన సీట్లు కూడా సీమంధ్రులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుండి వచ్చినవె.

కాబట్టి ఇప్పటికైనా ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడాలనుకుంటే రెండు కాళ్ళూ ఒకే పడవలో పెట్టడం అత్యంత అవసరం.

Wednesday, May 28, 2014

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది? రాజధాని ఎంపికని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

కోట్ల ప్రజానీక భయాందోళనలని లెక్క చేయకుండా, ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తూ, ఓట్లు సీట్ల కోసం, రాజధాని కూడా లేకుండా, ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న రాజధానిని ఒకే ప్రాంతానికి ధారాదత్తం చేసి, ఇంకో ప్రాంతానికి లోటు బడ్జెట్ తో చిప్ప చేతికి ఇచ్చి, ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేలా అరకొరగా చీల్చి పారేసి చేతులు దులుపుకొంది కాంగ్రెస్. దానికి తగిన మూల్యం చెల్లించింది. వచ్చే 20 సంవత్సరాలు ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు. కాంగ్రెస్ , కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని, దగాని అనుక్షణం గుర్తు తెచ్చేలా రాజధాని నిర్మాణం జరగాలి. 

రాజధానిగా రకరకాల పట్టణాలు ప్రచారం లోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా దొనకొండ, దర్శి, అద్దంకి, పొదిలి లాంటి ప్రదేశాలు అనువైనవని నా అభిప్రాయం. పునాదుల నుండి కడితే బాగుంటుంది. దాని వల్ల ప్రణాళికా బద్దంగా(చండీగడ్ లాగ) నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే రాజధానిలోనే అభివృద్ది మొత్తం కేంద్రీకరించకుండా కేవలం పరిపాలనకు మాత్రమె వాడుకుని సరి కొత్త చిన్న పట్టణం అయితే బాగుంటుంది. పై చెప్పిన ప్రాంతాలకి ఉన్న అనుకూలతలు:

1. మెట్ట ప్రాంతం కావడం. 
2. చిన్న పట్టణాలు కావడం తో అభివృద్ధికి అవకాశం. 
3. ప్రభుత్వానికి భూ సేకరణ భారం తగ్గుతుంది. అలాగే ప్రైవేటు వ్యక్తులు ఇళ్ళు కొనాలన్నా , వ్యాపారం ప్రారంభించాలన్నా అందుబాటులో ఉంటాయి. 
4. ఆంధ్ర ప్రదేశ్ కి దాదాపు మధ్యలో ఉండటం. 
5. రాజధాని దగ్గరలో ఉండటం వాళ్ళ ప్రకాశం జిల్లా మొత్తం అభివృద్ది చెందే అవకాశం. 
6. రేపు పొద్దున ఏ ఎదవా దోచుకోవడానికే మా పట్టణం కి వచ్చారు అనే ఆవకాశం లేకపోవడం. 
7. హైదరాబాద్ కి ఆక్సెస్ తక్కువగా ఉండటం ఒక అనుకూలం. లేదంటే సొంతగా ఎదిగే అవకాశాలు తగ్గుతాయి. కొత్త రాజధాని నుండి హైదరాబాద్ కి హై స్పీడ్ రోడ్ ప్రతిపాదన కూడా విరమించి అదే హై స్పీడ్ రహదారులని ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలని కలపడానికి, చిన్న రహదారులని విస్తరించడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. 

ఇక ఇప్పుడు రాజధాని కోసం పోటీ లో ఉన్న నగరాలని చూస్తె కొన్ని అనుకూలతలు ఉన్నాయి , ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతికూలతలని చూస్తె:

1. వైజాగ్ : ఇది ఇప్పటికే అభివృద్ది చెందిన పట్టణం. ఇప్పటికే పారిశ్రామికంగా, చలన చిత్ర పరిశ్రమ పరంగా, IT పరంగా కొంత ఇప్పటికే అభివృద్ది చెందింది. ఈ పట్టణాన్ని రాజధాని చేయడం వల్ల హైదరబాద్ విషయం లో చేసిన తప్పునే మళ్లీ చేసిన వారు అవుతాం. అలాగే ఇది రాయలసీమ ప్రాంతానికి కొంచెం దూరం కూడా. ఈ పట్టణం రాజధాని కాకపోయినా మంచి నాయకులు దీని మీద ద్రుష్టి పెడితే రాజదానికంటే బాగా అభివృద్ది చెందడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. 

2. గుంటూరు , విజయవాడ , ఏలూరు ప్రాంతం : ఇవి కోస్తాలో చాలా కీలకమైన ప్రదేశాలు. ఇంచు మించు అన్ని ప్రాంతాలకి అందుబాటు దూరం లో ఉన్నా రాజధాని అయితే విలువైన పంట భూములు కోల్పోవలసి వస్తుంది. అలాగే భూముల ధరలు కూడా ఎక్కువే. దాంతో చిన్న వ్యాపారస్తులు రావటానికి ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగే సామాన్య ప్రజానీకానికి ఇళ్ళు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా అందుబాటులో ధరలు అందుబాటులో ఉండవు. ఇంకో విషయం ఈ పట్టణాలన్నీ అంతో ఇంతో అభివృద్ది చెందినవే. రాజధాని కాకపోయినా భవిష్యత్తు లో అభివృద్ధికి అవకాశం ఉన్న నగరాలు. 

3. తిరుపతి : ఒక మూలగా ఉండటం ప్రతికూల అంశం. ఇప్పటికే తిరుపతి పెద్ద నగరం. దగ్గరలో పారిశ్రామికంగా కూడా అభివృద్ది చెంది ఉంది. దీనిని రాజధాని చేస్తే అడవుల్ని కొట్టేసి విస్తరించాల్సి వస్తుంది. జనాభా ఎక్కువ అయ్యే కొద్ది తిరుమల భద్రత, పవిత్రత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పట్టణాన్ని ఇలా ఉంచి భక్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తే మంచిది. 

4: కర్నూల్ : ఇంతకుముందు రాజధానిని కోల్పోయిన నగరంగా రాజధానిని తిరిగి అడిగే హక్కు ఉంది అయితే ఒక మూలగా ఉండటం ఈ నగరానికి ప్రతికూలం.

రాజధాని ఎక్కడైతే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు?

కానిస్టేబుల్ కావాలంటే పది పాసవ్వాలి కాని కేంద్ర మంత్రి కావాలంటే అవసరం లేదు :)

కానిస్టేబుల్ కావాలంటే పది పాసవ్వాలి కాని కేంద్ర మంత్రి కావాలంటే అవసరం లేదు. ఎంత అసంబద్ధం? ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఆరుగురు పదో తరగతి లేదా ఆ లోపు చదివిన వారు ఉన్నారు. ఒక చిన్న కంపెనీకి అకౌంటెంట్ ని ఎంపిక చేయాలంటేనే డిగ్రీ చూస్తారు, అనుభవం చూస్తారు, పరీక్ష చేసి వీడు మన కంపెనీ ని వృద్ధిలోకి తీసుకు వచ్చే సత్తా ఉంది అంటేనే ఎంపిక చేస్తారు. అలాంటిది ఒక దేశం(లేదా రాష్ట్రం) మొత్తానికి ప్రాతినిధ్యం వహించే శాఖల మంత్రులకి మాత్రం ఏ అర్హత అవసరం లేదు. ఏమి చేసి అయినా సరే ప్రజా ప్రతినిధి గా గెలిచే సత్తా, ప్రజా బలం ఉంటె చాలు. అయిదేళ్ళు అయిపోతే మళ్లీ కొత్తవాడు. మన అదృష్టం ఏమిటంటే బలమైన పరిపాలనా వ్యవస్థ ఉండటం.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అలాగే బాగా చదువుకున్న వాడు బాగా పని చేస్తాడని, చదువుకొని వాడు ఏమి చేయలేడు అని కూడా లేదు. అయితే, ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక కనీస విద్యార్హత (ఉదాహరణకు ఆర్ధిక శాఖ అయితే కనీసం b.com చదివి ఉండటం), ఆ రంగం లో కనీస అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.

మీ అభిప్రాయం ఏమిటి ?