Thursday, May 29, 2014

చంద్రబాబు రెండు పడవల్లో కాళ్ళు తీసి ఒకే పడవలో పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది

చంద్రబాబు గారూ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలని సమదృష్టితో చూడాలనుకోవడం అభినందనీయం. అయితే ఆంద్రప్రదేశ్ కి నష్టం చేకూర్చే అంశాలలో ఈ మీ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోంది.

అతి వాద తెలంగాణా వాదులు ఆంధ్ర ప్రాంతం వారు తమ వారు కాదు అనుకుంటున్నారు. కేవలం వాళ్ళ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి అన్ని అంశాల మీదా ఎంత అరాచకంగా అయినా మాట్లాడగలుగుతున్నారు. వారికి హక్కు లేని విషయాల్లోనూ అర్థ సత్యాలని, అసత్యాలని ప్రచారం చేసి ప్రయోజనం పొందుతున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలని ఇరుకున పెట్టడానికి తెలంగాణాలో మిగిలిన రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఇతర సంఘాలు అందరూ ఒక్కటైనారు. వాళ్ళ లాగా మీరు విద్వేషం దారిలో వెళ్ళకండి కానీ ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల విషయం లో మాత్రం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణకి ఉద్యోగుల విషయం: మొదట ఆప్షన్స్ ఉండవు అన్న కచరా, తరువాత నాలుక మడతేసి కేవలం అక్రమంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు మాత్రమే వెళ్ళాలి అని చెప్పాను అన్న కచరా, మళ్లీ నాలుక రెండు మడతలేసి ఒక్క సీమాంధ్ర ఉద్యోగి కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని హుంకరిస్తుంటే, దానికి అరాచక వాద బాచ్ అంతా తాళం వేస్తుంటే మీరు గట్టిగా మాట్లడలేకపోతున్నారు. స్టేట్ లెవెల్ ఉద్యోగాలకి స్థానికత వర్తించదు. అలాగే మిగిలిన కొన్ని ఉద్యోగాల్లో 20% నాన్ లోకల్ కోటా కింద ఉద్యోగం తెచ్చుకుని 20-30 ఏళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా హైదరాబాద్ లో స్థిరపడిన వారిని కేవలం ఇక్కడ చదువుకోలేదు కాబట్టి స్థానికుడు కాదు అని నిర్ధారించి తరమడానికి పూనుకుంటుంటే, అయ్యా వాళ్ళకీ హక్కులుంటాయి అని ఒక్క గొంతుక కూడా అరువు వచ్చిన పాపాన పోలేదు. సచివాలయం లో 90% సీమంద్రులే అని అరాచకవాదులు ప్రచారం చేసి తెలంగాణా ప్రజల్లో విద్వేష విషం నింపి తెలంగాణా సాధిస్తే, లెక్కలు తీసినప్పుడు వారి స్థానిక నిర్వచనం ప్రకారం చూసినా దాదాపు దామాషా ప్రకారం ఉన్నారు అని తేలినప్పుడు కనీసం సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి చర్చ పెట్టె ప్రయత్నం చేయలేదు.  ఏమైనా మాట్లాడితే తెలంగాణాలో పార్టీ ని బద్నాం చేస్తారని భయం.

ఇక పోలవరం సంగతి: ఆంద్రప్రదేశ్ కి చెందిన భద్రాచలం లో కొన్ని మండలాల్ని మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ లోనే కలిపితేనే ఇంత రచ్చ చేస్తున్నారు అతి వాద తెలంగాణా ఉన్మాదులు. డిజైన్ మార్చమని డిమాండ్ - డిజైన్ మార్చి మళ్లీ అనుమతులతో మొదలు పెడితే 100 ఏళ్ళు అయినా పూర్తి కాదు అని తెలియదా.  ఇక మండలాలని కలపడం వల్ల ఇప్పుడు ముంపుకు గురవుతున్న వాళ్లకి దగ్గరలోనే అదే మండలం లోనో, పక్క మండలం లోనో పునరావాసం కల్పించడానికి వీలవుతుంది అనే విషయం వీరికి తెలియనిదా? ప్రతి దాన్ని తెగే దాకా లాగి ప్రజలని భావోద్వేగం లో ఉంచి లబ్ది పొందడానికే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

సీమాంధ్రుల శ్రమతో అభివృద్ది చెంది ఇన్ని ఉపాధి అవకాశాలు, ఆదాయం ఏక పక్షంగా కేవలం భౌగోళిక కారణాలతో తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు. 1956 లో సీమాంధ్ర ప్రాంతం లో భాగమైన భద్రాచలం, మునగాల, అశ్వారావు పేట తెలంగాణా కి ధారాదత్తం చేస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడలేక పోతున్నారు? బహుళ ప్రయోజనాల శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం కర్నూల్ లో అంతర్భాగం అని ఋజువులతో సహా అధికారులు నిరూపించినా దానిపై హక్కుల కోసం పోరాడకుండా ఎందుకు నిష్క్రియాశీలంగా ఉన్నారు? మీరు ఊరుకున్న కొద్దీ అరాచక శక్తులు ఏదో ఒక పనికి మాలిన సమస్యలని సృష్టించి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 ఒక్క విషయం, మీరు మాట్లాడినా బద్నాం చేస్తారు. మాట్లాడకపోయినా బద్నాం చేస్తారు. వాళ్ళ విద్వేష ప్రచారం ముందు మీ సమ న్యాయం  ప్రచారం తేలిపోయిందని ప్రజలే తీర్పిచ్చారు. ఇంకా ఎందుకు దాన్ని పట్టుకు వేలాడతారు? మీరు హైదరాబాద్ ని, తెలంగాణా ని ఎంత అభివృద్ది చేసినా అతివాదులతొ పాటు సామాన్య తెలంగాణా ప్రజలు కూడా ఈ అరాచక శక్తులనే సమర్థించారు. తోటి సోదరులు విభజన వల్ల ఎంత నష్టపోతున్నా, ఇంకా నష్టం కలగ జేయడానికి, అవమానకరంగా మాట్లాడటానికి, తెలంగాణా సీమాంధ్ర మధ్య సంబంధాలు తెగ్గోట్టడానికి  అతివాదులు తెగబడుతున్నా, వారు చేస్తోంది తప్పు అని ఒక్క తెలంగాణా వ్యక్తీ కూడా ముందుకు రాలేదు.  మీకు వచ్చిన సీట్లు కూడా సీమంధ్రులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుండి వచ్చినవె.

కాబట్టి ఇప్పటికైనా ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడాలనుకుంటే రెండు కాళ్ళూ ఒకే పడవలో పెట్టడం అత్యంత అవసరం.

Wednesday, May 28, 2014

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది? రాజధాని ఎంపికని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

కోట్ల ప్రజానీక భయాందోళనలని లెక్క చేయకుండా, ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తూ, ఓట్లు సీట్ల కోసం, రాజధాని కూడా లేకుండా, ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న రాజధానిని ఒకే ప్రాంతానికి ధారాదత్తం చేసి, ఇంకో ప్రాంతానికి లోటు బడ్జెట్ తో చిప్ప చేతికి ఇచ్చి, ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేలా అరకొరగా చీల్చి పారేసి చేతులు దులుపుకొంది కాంగ్రెస్. దానికి తగిన మూల్యం చెల్లించింది. వచ్చే 20 సంవత్సరాలు ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు. కాంగ్రెస్ , కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని, దగాని అనుక్షణం గుర్తు తెచ్చేలా రాజధాని నిర్మాణం జరగాలి. 

రాజధానిగా రకరకాల పట్టణాలు ప్రచారం లోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా దొనకొండ, దర్శి, అద్దంకి, పొదిలి లాంటి ప్రదేశాలు అనువైనవని నా అభిప్రాయం. పునాదుల నుండి కడితే బాగుంటుంది. దాని వల్ల ప్రణాళికా బద్దంగా(చండీగడ్ లాగ) నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే రాజధానిలోనే అభివృద్ది మొత్తం కేంద్రీకరించకుండా కేవలం పరిపాలనకు మాత్రమె వాడుకుని సరి కొత్త చిన్న పట్టణం అయితే బాగుంటుంది. పై చెప్పిన ప్రాంతాలకి ఉన్న అనుకూలతలు:

1. మెట్ట ప్రాంతం కావడం. 
2. చిన్న పట్టణాలు కావడం తో అభివృద్ధికి అవకాశం. 
3. ప్రభుత్వానికి భూ సేకరణ భారం తగ్గుతుంది. అలాగే ప్రైవేటు వ్యక్తులు ఇళ్ళు కొనాలన్నా , వ్యాపారం ప్రారంభించాలన్నా అందుబాటులో ఉంటాయి. 
4. ఆంధ్ర ప్రదేశ్ కి దాదాపు మధ్యలో ఉండటం. 
5. రాజధాని దగ్గరలో ఉండటం వాళ్ళ ప్రకాశం జిల్లా మొత్తం అభివృద్ది చెందే అవకాశం. 
6. రేపు పొద్దున ఏ ఎదవా దోచుకోవడానికే మా పట్టణం కి వచ్చారు అనే ఆవకాశం లేకపోవడం. 
7. హైదరాబాద్ కి ఆక్సెస్ తక్కువగా ఉండటం ఒక అనుకూలం. లేదంటే సొంతగా ఎదిగే అవకాశాలు తగ్గుతాయి. కొత్త రాజధాని నుండి హైదరాబాద్ కి హై స్పీడ్ రోడ్ ప్రతిపాదన కూడా విరమించి అదే హై స్పీడ్ రహదారులని ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలని కలపడానికి, చిన్న రహదారులని విస్తరించడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. 

ఇక ఇప్పుడు రాజధాని కోసం పోటీ లో ఉన్న నగరాలని చూస్తె కొన్ని అనుకూలతలు ఉన్నాయి , ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతికూలతలని చూస్తె:

1. వైజాగ్ : ఇది ఇప్పటికే అభివృద్ది చెందిన పట్టణం. ఇప్పటికే పారిశ్రామికంగా, చలన చిత్ర పరిశ్రమ పరంగా, IT పరంగా కొంత ఇప్పటికే అభివృద్ది చెందింది. ఈ పట్టణాన్ని రాజధాని చేయడం వల్ల హైదరబాద్ విషయం లో చేసిన తప్పునే మళ్లీ చేసిన వారు అవుతాం. అలాగే ఇది రాయలసీమ ప్రాంతానికి కొంచెం దూరం కూడా. ఈ పట్టణం రాజధాని కాకపోయినా మంచి నాయకులు దీని మీద ద్రుష్టి పెడితే రాజదానికంటే బాగా అభివృద్ది చెందడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. 

2. గుంటూరు , విజయవాడ , ఏలూరు ప్రాంతం : ఇవి కోస్తాలో చాలా కీలకమైన ప్రదేశాలు. ఇంచు మించు అన్ని ప్రాంతాలకి అందుబాటు దూరం లో ఉన్నా రాజధాని అయితే విలువైన పంట భూములు కోల్పోవలసి వస్తుంది. అలాగే భూముల ధరలు కూడా ఎక్కువే. దాంతో చిన్న వ్యాపారస్తులు రావటానికి ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగే సామాన్య ప్రజానీకానికి ఇళ్ళు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా అందుబాటులో ధరలు అందుబాటులో ఉండవు. ఇంకో విషయం ఈ పట్టణాలన్నీ అంతో ఇంతో అభివృద్ది చెందినవే. రాజధాని కాకపోయినా భవిష్యత్తు లో అభివృద్ధికి అవకాశం ఉన్న నగరాలు. 

3. తిరుపతి : ఒక మూలగా ఉండటం ప్రతికూల అంశం. ఇప్పటికే తిరుపతి పెద్ద నగరం. దగ్గరలో పారిశ్రామికంగా కూడా అభివృద్ది చెంది ఉంది. దీనిని రాజధాని చేస్తే అడవుల్ని కొట్టేసి విస్తరించాల్సి వస్తుంది. జనాభా ఎక్కువ అయ్యే కొద్ది తిరుమల భద్రత, పవిత్రత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పట్టణాన్ని ఇలా ఉంచి భక్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తే మంచిది. 

4: కర్నూల్ : ఇంతకుముందు రాజధానిని కోల్పోయిన నగరంగా రాజధానిని తిరిగి అడిగే హక్కు ఉంది అయితే ఒక మూలగా ఉండటం ఈ నగరానికి ప్రతికూలం.

రాజధాని ఎక్కడైతే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు?

కానిస్టేబుల్ కావాలంటే పది పాసవ్వాలి కాని కేంద్ర మంత్రి కావాలంటే అవసరం లేదు :)

కానిస్టేబుల్ కావాలంటే పది పాసవ్వాలి కాని కేంద్ర మంత్రి కావాలంటే అవసరం లేదు. ఎంత అసంబద్ధం? ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఆరుగురు పదో తరగతి లేదా ఆ లోపు చదివిన వారు ఉన్నారు. ఒక చిన్న కంపెనీకి అకౌంటెంట్ ని ఎంపిక చేయాలంటేనే డిగ్రీ చూస్తారు, అనుభవం చూస్తారు, పరీక్ష చేసి వీడు మన కంపెనీ ని వృద్ధిలోకి తీసుకు వచ్చే సత్తా ఉంది అంటేనే ఎంపిక చేస్తారు. అలాంటిది ఒక దేశం(లేదా రాష్ట్రం) మొత్తానికి ప్రాతినిధ్యం వహించే శాఖల మంత్రులకి మాత్రం ఏ అర్హత అవసరం లేదు. ఏమి చేసి అయినా సరే ప్రజా ప్రతినిధి గా గెలిచే సత్తా, ప్రజా బలం ఉంటె చాలు. అయిదేళ్ళు అయిపోతే మళ్లీ కొత్తవాడు. మన అదృష్టం ఏమిటంటే బలమైన పరిపాలనా వ్యవస్థ ఉండటం.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అలాగే బాగా చదువుకున్న వాడు బాగా పని చేస్తాడని, చదువుకొని వాడు ఏమి చేయలేడు అని కూడా లేదు. అయితే, ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక కనీస విద్యార్హత (ఉదాహరణకు ఆర్ధిక శాఖ అయితే కనీసం b.com చదివి ఉండటం), ఆ రంగం లో కనీస అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.

మీ అభిప్రాయం ఏమిటి ?

Tuesday, May 27, 2014

సంక్షేమ పథకాలు/ఉచిత పథకాలు ఓట్లకి దగ్గర దారులా?

ప్రభుత్వాలన్నీ తమ సంక్షేమ పథకాల గురించి చాలా గొప్పగా వల్లె వేస్తున్నాయి. ఈ పథకాలు అవసరమా? అవసరం అయితే ఎంత వరకు? దానికి ప్రాతిపదిక ఏంటి?

మన రాష్ట్రంలో నేను గమనించినంతవరకు సంక్షేమ/ఉచిత పథకాలు ఓట్లు కొల్లగొట్టే మార్గాలుగా వాడింది మొదట రాజశేఖర్ రెడ్డి.  దాన్ని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రభుత్వాలు ముందుకు తీసుకుని వెళ్ళాయి. ఇప్పుడు పాత వాటిని కొనసాగిస్తూ అంతకు మించిన హామీలతో చంద్రబాబు, కెసిఆర్ ప్రభుత్వాలని ఏర్పాటు చేయబోతున్నారు. 

రాజశేఖర రెడ్డి మొదటి సారి అధికారం లోకి రావడానికి వాడిన బ్రహ్మాస్త్రం రైతులకి ఉచిత విద్యుత్. అప్పటికే వర్షాలు సరిగా లేక చితికిపోయిన రైతులకి అది ఒక అయాచిత వరంగా మారింది. అయితే ఇక్కడ మూడు విషయాలు. 
ఒకటి, ఒక చేత్తో ఉచిత విద్యుత్ ఇస్తూ రెండో చేత్తో నకిలీ ఎరువులు (కడప మాజీ మేయర్ లీలలు లాంటివి), నకిలీ విత్తనాలు కట్టడి చేయకుండా రైతులని ముంచారు. మాది రైతు కుటుంబం. అంతకు మునుపెన్నడూ ఎరువులకోసం, విత్తనాల కోసం లైన్లలో నిలుచుని తీసుకోవడం చూడలేదు. ఎరువుల విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది అయినా, ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సరైన ఎరువులు , విత్తనాలు లేకుండా ఎంత విద్యుత్ ఇచ్చినా లాభం లేదు. 
ఇక రెండోది ఉచిత విద్యుత్ వల్ల బాధ్యత  లేకుండా భూగర్భ జలాలు తోడేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం. 
మూడోది - ఖజానా మీద భారం. రిజర్వేషన్స్ లాగా దీనిని కూడా కనుచూపు మేరలో తీసేసే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే తీసేసే ఆలోచన చేయగానే ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకి గా ముద్ర కొట్టడానికి ప్రతిపక్షాలు, పత్రికలూ సిద్ధంగా ఉంటాయి. 
అయితే కరువుతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుకి ఇది స్వాంతన కలిగించిన్దనటం లో సందేహం లేదు. 

ఇక ఇప్పుడు కొలువుదీరబోతున్న చంద్రబాబు, కెసిఆర్ ఉచిత హామీలకైతే లెక్కే లేదు. ఉదాహరణకి రైతు రుణ మాఫీ. ఇది అధికారం లోకి రావడానికి ఉపయోగపడొచ్చు కానీ వేల కోట్ల ప్రజాధనం ఒక సెక్టార్ ప్రజలకి ఉపయోగించడం తప్పని నా అభిప్రాయం. మా ఊరిలోనే డబ్బు ఉన్నా తక్కువ వడ్డీ అని, ఇన్సూరెన్స్ వస్తుందని వ్యవసాయ రుణాలు తీసుకుని వేరే వాటికి వాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవసరం లేకపోయినా ఋణం తీసుకుని వాడుకున్న వాళ్లకి ఇప్పుడు రుణ మాఫీ చేస్తే ఋణం తీసుకొని/తీసుకోలేని వాడితో పోలిస్తే అయాచితంగా ఒకటో, రెండో, మూడో లక్షలు అయాచితంగా వచ్చినట్లే. దాని వల్ల ఎంత ఆర్ధిక తారతమ్యాలు ఏర్పడతాయి? రిచ్ గెట్స్ రిచర్ అన్నట్లు ఉంటుంది. నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి దాని నుండి బయట పడలేని వాళ్లకి ఇది వరం కాదనను. అయితే ప్రభుత్వం బాధ్యత దానికి గల కారణాలు అన్వేషించి వాటినుండి బయట పడటానికి గల మార్గాలు అన్వేషించాలి. ఉదాహరణకి రైతుకి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం , దళారుల నుండి విముక్తి కలిగించి గిట్టుబాటు ధర అందేలా చూడటం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడానికి గల మార్గాలు శోధించడం,  భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా సాధ్యమైనంత సేంద్రియ ఎరువులు వాడేలా రైతుల్ని చైతన్య పరచటం, రైతులు పండించింది మార్కెటింగ్ చేసుకోవడానికి, ఎగుమతి చేయడానికి సులువైన మార్గాలు సృష్టించడం, నాణ్యమైన ఎరువులు , విత్తనాలు ప్రదేశాలకి తగ్గట్టు అందేలా చర్యలు తీసుకోవడం ,  పండించిన ధాన్యాన్ని తరలించడానికి ప్రతి ఊరికి మంచి రహదారులు వేయడం, వ్యవసాయ ఉత్పత్తులకి విలువను జోడించే పరిశ్రమలని ప్రోత్సహించడం లాంటి దీర్ఘకాలిక ప్రణాలికలపై ఖర్చు పెడితే బాగుంటుంది. 

ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టేది పాలించమని అంతే కాని వాటిని వాడుకొని తను గద్దేనెక్కడానికి కాదు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా, ఎలాంటి పరిమితులు లేకుండా పెట్టె ఇలాంటి పథకాల వల్ల ఒక వర్గపు ప్రజలకి మేలు కలగొచ్చు కానీ సమాజానికి ఏమి మేలు జరగదు. నిన్న ఉచిత విద్యుత్ , ఇవ్వాళ రుణ మాఫీ, రేపు పొద్దున్న డోస్ పెంచాలి కాబట్టి కుటుంబానికి సంవత్సరానికి లక్ష అంటూ మొదలు పెడతారు. వాళ్ళ సొమ్మేం పోయింది. అంతా ప్రజా ధనమే కదా. అలా అని కష్టం వస్తే వదిలేయమనట్లేదు కానీ దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. శాస్త్రీయత ఉండాలి. ప్రజలు కట్టే పన్నులు ఒక వర్గానికి కాకుండా సమాజం మొత్తానికి మేలు చేసే విధంగా దీర్ఘ కాలిక ప్రణాలికలని తయారు చేయాలి. మనకి మిగులు ఉంటె వేరే విషయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఇలాంటి ఉచిత హామీల వల్ల నిజంగా ఖర్చు పెట్టాల్సిన వాటి మీద పెట్టకుండా వెనకపడి పోతాం. 

చివరగా ప్రభుత్వాలు చేపలు ఎలా పట్టాలో నేర్పించాలి కానీ చేపల్ని చేతికి ఇచ్చే సంస్కృతి నుండి బయటపడాలి. Give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime. దానికి ప్రతి పక్షాలు, ప్రజలు సహకరించాలి. 






Sunday, May 25, 2014

మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సే ని పిలవటం పై మీ అభిప్రాయం

మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధ్యక్షులకి ఆహ్వానం పంపడం తెలిసిందే. ఈ విషయం పై తమిళనాడు రాజకీయ పార్టీలు, ప్రజలు రాజపక్సే కి ఆహ్వానం పంపడం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదొక సున్నితమైన అంశం.

స్థూలంగా LTTE ని పూర్తిగా మట్టుపెట్టినందుకు తమిళ ప్రజలకి రాజపక్సే అంటే ద్వేషం (పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువగా) . తమిళులు LTTE కి ఎన్నో విధాలుగా సాయం చేశారు ఈ విషయంలో. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు.  ఇది తప్పు. ఐతే  తమ వాళ్ళని ఊచకోత కోశారు అనే కోపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

శ్రీలంక కోణం నుండి చూస్తె శ్రీలంక లో ఉన్న తమిళులకి హక్కులు నిరాకరించటం తప్పు అయినా అది వారి దేశానికి సంబంధించిన విషయం. అక్కడికి తరలి వెళ్ళిన వారు హక్కులకోసం పోరాడవచ్చు, నిరసన తెలియజేయవచ్చు కానీ సాయుధ పోరాటం చేయటం ముమ్మాటికీ తప్పని నా అభిప్రాయం. అలాగే శ్రీలంక ప్రభుత్వం LTTE తో పాటు పిల్లలతో సహా ఎంతో మంది అమాయకులని మట్టు పెట్టింది. శ్రీలంక కోణంలో అది దేశ రక్షణ కోసం తీసుకున్న చర్య కావొచ్చు కానీ ఆ పేరుతో అమాయకుల ఊచకోత సహించరానిది. 

ఈ భావోద్వేగాల మధ్య నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాలలో ఒకటైన శ్రీలంకకి కూడా ఆహ్వానం పంపింది. తమిళ రాజకీయ పార్టీ లు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. నా దృష్టిలో రెండు వైపులా తప్పులు జరిగాయి. గతాన్ని మర్చిపోయి తోటి దేశాలతో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. అదే సమయం లో తమిళ ప్రజల భావోద్వేగాలని పరిగణన లోకి తీసుకుని వారికి భారత ప్రభుత్వం తన ఆలోచనలని వివరించి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సేని ఆహ్వానించడాన్ని  మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ఎందుకు ?

Wednesday, May 21, 2014

సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుక్కుంటున్న రష్యా

ఉక్రెయిన్ సంక్షోభం, క్రిమియా అనే ద్వీపకల్పాన్ని రష్యా లో కలపడం, దాన్ని జీర్ణించుకోలేని అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించడం తెలిసిందే. 

రష్యా ఉత్పత్తి చేసే సహజ వాయువు (natural gas), 38.7 %  యూరోప్ గ్యాస్ అవసరాలని తీరుస్తోంది. అందులో ఫిన్లాండ్ లాంటి దేశాలు 100% రష్యా గ్యాస్ మీద ఆధారపడ్డాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేశం జర్మనీ. జర్మనీ 36% గ్యాస్ అవసరాలని రష్యా తీరుస్తోంది. 

ఉక్రెయిన్ సంక్షోభం లో రష్యాని ముద్దాయిని చేసి ఇరుకున పెట్టడానికి పాశ్చాత్య దేశాలన్నీ కలిసి (ముఖ్యంగా అమెరికా) ఈ ఆంక్షల్ని విధించాయి. ఈ ఆంక్షల ప్రకారం పుతిన్ కి దగ్గరైన అధికారులు, సంస్థల మీద వ్యాపార, ఆర్ధిక, ప్రయాణ ఆంక్షలు విధించాయి. అలాగే యూరోప్ రష్యా గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది అంత సులభమైన విషయం కాదు. రష్యా కూడా తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మార్గాలని అన్వేషించింది. ఈ క్రమం లో ఎప్పటినుండో చైనాతో అపరిష్కృతంగా ఉన్న డీల్ తెరపైకి వచ్చింది. ఈ డీల్ ప్రకారం రష్యా వచ్చే 30 ఏళ్ళలో కొత్తగా నిర్మించే పైప్ లైన్ ద్వారా 23,20,000 కోట్లు ($400 బిలియన్)  విలువ గల గ్యాస్ ని చైనా కి సరఫరా చేయబోతోంది. 

ఈ డీల్ రష్యాకి ఆర్థికంగా మేలు చేస్తే, చైనా ఎనర్జీ అవసరాలు తక్కువ ఖర్చుతో తీర్చడానికి ఉపయోగపడింది. అంతకంటే ముఖ్యంగా చైనా, రష్యా ల మధ్య బంధం మరింత బలపడటానికి దోహదం చేసింది. అమెరికా కి ఇంకా మంటేక్కించే విషయం వ్యాపారం డాలర్స్ లో కాకుండా వాళ్ళ సొంత కరెన్సీ లో చేయడం. రష్యా తన వ్యాపారాన్ని భారత్, జపాన్ లతో కూడా పెంపొందించుకోవడానికి పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అమెరికాకి పెద్ద అశనిపాతమే అని చెప్పొచ్చు. అప్పుడు ఆసియా లో అమెరికా ప్రాభవం పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు అమెరికా మోడీ తో సత్సంబందాలకోసం స్నేహ హస్తం చాస్తోంది. అయితే అమెరికా మోడీ విషయం లో ఇంతకుముందు వ్యవహరించిన తీరు వల్ల అది కొంచెం కష్టం కావొచ్చు

మొదట్లో ఈ ఆంక్షలు అమెరికా ద్వేషించే రష్యాకి పెద్ద నష్టంగా విశ్లేషకులు భావించారు.అమెరికా తెలివితో ఒకే రాయితో రెండు పిట్టల్ని కొట్టడానికి చూసింది. మొదటిది రష్యాని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయడం. అదే అదనులో తన గ్యాస్ ని యూరోప్ కి అమ్మడానికి ప్రణాళికల్ని రచించడం. అయితే చివరకి రష్యా కి ఆర్థికంగానూ, దౌత్యపరంగానూ మేలు చేసి అమెరికా తను తీసుకున్న గోతిలో తనే పడింది. సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుక్కున్న రష్యా ఈ ఎపిసోడ్ కి విజేత గా నిలిచింది. 

Friday, May 16, 2014

హలో ... నా బ్లాగు కి స్వాగతం



హలో , బ్లాగ్ మిత్రులందరికీ నమస్కారాలు . నా పేరు శ్రీనివాస్. ఇప్పటి దాకా ఎన్నో విషయాల మీద అభిప్రాయాలని తోటి తెలుగు వారితో పంచుకోవాలనిపించింది కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. 

నాకు సాంకేతిక విజ్ఞానం , రాజకీయాలు చాలా ఇష్టమైనవి. నాకు తెలిసిన విషయాలని, తోటి తెలుగు వారితో పంచుకోవాలనే ఈ చిన్న ప్రయత్నం.

గత కొన్ని సంవత్సరాలుగా కూడలి లో టపాలు చూస్తున్నాను. నల్లమోతు శ్రీధర్ గారి సాంకేతికాలు, శ్యామలీయం గారి పాండిత్యం, స్వేచ్చా సాఫ్ట్వేర్ లపై శ్రీనివాస్ గారి ప్రేమ, మురళి గారి తేట గీతి, జిలేబి గారి చమక్కులు, మనువు , జీవని ఇంకా ఎన్నో చక్కటి బ్లాగులతో అమూల్యమైన సమాచారాన్ని, వినోదాన్ని, విశ్లేషణలని పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు.