Thursday, July 10, 2014

ఆంధ్రప్రదేశ్ - అభివృద్ది నమూనా : చిరునామా


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలతో పోలిస్తే ఇది చాలా చిన్న సమస్య కానీ చిరునామా కోసం ఇప్పుడు  మనం అనుసరిస్తున్న విధానం వల్ల బయటకి కనిపించని నష్టం అపారం.  మనం అనుసరిస్తున్న విధానం లో చిన్న మార్పుతో ఎన్నో లాభాలు పొందొచ్చు. మొదటగా ఏదైనా చిరునామా కోసం వెతుకుతున్నప్పుడు మీకు దాని లోపాలు అవగతం అయ్యే ఉంటాయి. 

ఉదాహరణకి ఈ కింది పటం చూడండి. 


ఇక్కడ చూపించిన ఇల్లు చిరునామా ఉదాహరణకి ఇలా ఉంటుంది. 

వెంకట్ రావు,
16-372/1/A  సాయి రెసిడెన్సీ, అపార్ట్ మెంట్ 12, విజ్ఞేశ్ హైట్స్ వెనకాల, 
సాయిబాబా గుడి పక్కన, పోరంకి , విజయవాడ, కృష్ణా జిల్లా - 521137, ఆంధ్ర ప్రదేశ్

ఆ ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అంబులన్స్ కి ఫోన్ చేశారనుకోండి. అంబులన్స్ ఎలా చేరుకోవాలి? లేదా ఫైర్ ఇంజిన్? లేదా ఎవరైనా ఆ ఇంటి మీద దాడికి వచ్చారు, పోలీస్ కి ఫోన్ చేశారు అనుకోండి. 10 సెకన్ల లో చిరునామా చెప్పాలి ఏమని చెప్తారు? వాళ్ళు ఆ ఇంటికి ఎలా చేరుకుంటారు?  బంధువులే వచ్చారు, ఇంటికి దారి  ఎలా చెప్తారు ?
ఇంకొన్ని దృష్టాంతాలు :

1. ఏదైనా ప్రభుత్వ సేవ (ఉదాహరణకి అంబులన్స్, ఫైర్, పోలీస్ శాఖ,  బీమా, రాయితీలు, జన గణన లాంటివి)  లేదా ప్రైవేటు సేవలు  (బ్యాంకు ఖాతా కి సంబంధించి, లేదా ఏదైనా ఇంటికి వచ్చి చేసే సేవ లాంటివి) ఖచ్చితంగా అమలు కావాలంటే 
2. సేవలు, ఇతర అవసరాల ఖచ్చితమైన సరిహద్దుల కోసం (For ex: Police jurisdiction) 
3. చిరునామా దొరక్క పోవడం వల్ల వ్యాపారాన్ని కోల్పోయే వ్యాపార సంస్థలు
4. తపాలా శాఖ , పార్సెల్ కంపెనీలకి చిరునామా దొరక్క పార్సెల్ వెనక్కి పోవడం, వేరే చోట కి వెళ్ళడం లేదా మిస్ అవ్వడం లాంటి వాటి వల్ల , సరైన సమయానికి చేరకపోవడం వల్ల, మళ్ళీ తిరిగి పంపటానికి అయ్యే ఖర్చులు లాంటివి అపారం. ఈ ఖర్చుని చివరకి వినియోగదారులే భరించాలి. ప్రతి రోజూ కొన్ని మిలియన్ టన్నుల సరుకులు పంపిణీ అవుతుంటాయి. విధిగా రోజూ చేసే వాళ్లకి ఇబ్బంది లేదు కానీ కొత్తగా ఏది ఎక్కడికి పంపిణీ చేయాలన్నా చిరునామా కనుక్కోవడానికి సమయం, ఇంధనం, శ్రమ రూపంలో ఎంతో డబ్బు వృధా.
5. లా ఎంఫోర్సుమెంట్ (ఉదాహరణకి ఒక చలానా పంపాలంటే)
6. కంప్యూటర్ ఆధారిత సేవలు, కంప్యూటర్ ఆధారిత చిరునామా వెతకడం లో సౌలభ్యం (కేవలం ఈ ఒక్క విషయం లో కొన్ని వందల కోట్లు వృథా అవుతున్నాయి అనటం అతిశయోక్తి కాదు)
7. GPS లాంటి వ్యవస్థలు సరైన దారి చూపడానికి

ఇలా ఎన్నో వాటికి మంచి చిరునామా పధ్ధతి ఎంతైనా అవసరం.

మరి చిరునామాకి మంచి పధ్ధతి ఏమిటి? అమెరికాలో ఉన్న పధ్ధతి నాకు బాగా నచ్చింది. జపాన్ దేశ పధ్ధతి కూడా కొంచం మన పధ్ధతి లాగానే ఉంటుంది. తేడా కోసం ఈ వీడియో చూడండి - https://www.youtube.com/watch?v=q1zh49J5rsg

అమెరికా లో ప్రధానంగా రహదారి ఆధారిత చిరునామా పధ్ధతి ఉంది. అది ఇలా ఉంటుంది

వ్యక్తి లేదా సంస్థ పేరు
ఇంటి నెంబర్, వీధి పేరు,
అపార్ట్ మెంట్ నెంబర్ లేదా సూట్ నెంబర్
నగరం, రాష్ట్రం - పిన్ కోడ్.

 ఏ చిరునామా అయినా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. ఉదాహరణకి

గూగుల్ సంస్థ చిరునామా
Google Inc
1600 Amphitheatre Pkwy,
Mountain View, CA - 94043    
మైక్రోసాఫ్ట్ చిరునామా
Microsoft Corporation 
One Microsoft Way 
Redmond, WA - 98052    
పేస్ బుక్ చిరునామా 
Facebook Inc 
1601 Willow Rd, 
Menlo Park, CA - 94025    

ఈ పద్ధతిలో ప్రధానాంశాలు
1. ఒక  రాష్ట్రం లో ఒక పేరుతొ ఒకే నగరం.
2. ఒక నగరం లో ఒక పేరుతొ ఒకే వీధి
3. ఒక వీధి లేదా రహదారి మొదలు అయిన చోటు నుండి ఒక వైపు సరి సంఖ్య, రెండో వైపు బేసి సంఖ్యతో ఇళ్ళ అంకెలు (దీని వల్ల ఒక వీధిలో ఇంటి సంఖ్య 1331 కోసం వెతుకుతున్నాం అనుకోండి ఒక వైపే చూసుకుంటూ వెళ్ళొచ్చు. పైగా క్రమ పద్ధతిలో ఉంటాయి కాబట్టి కనుక్కోవడం సులభం)


4. పక్క పక్కన ఉన్న ఇళ్ళ అంకెల మధ్యలో ఎడం (ఉదాహరణకి 100, 200 అలా. దీని వల్ల రెండిటి మధ్యలో ఇంకో ఇల్లు కట్టినా 150 అని పెట్టుకోవచ్చు. ఇళ్ళ అంకెలు క్రమ పధ్ధతి లోనే ఉంటాయి.)
5. ప్రతి ఇల్లు లేదా వ్యాపార భవనం ముందు విధిగా వీధిలోకి కనిపించే విధంగా ఇంటి సంఖ్య అమర్చాలి.

ఇంకో ముఖ్య అంశం చిరునామాలో జిల్లా లేకపోవడం మీరు గమనించొచ్చు. అమెరికా లో ప్రతి రెండు వీధులు కలిసే చోట వీధి నామాలతో కింది విధంగా బోర్డులు ఉంటాయి.


వీధి నామం సూచించే బోర్డుమీద ఇంటి సంఖ్య సూచనలు కూడా ఛాలా చోట్ల ఉంటాయి. ఉదాహరణకి  " 4500 Kaphan Ave 4600" ఉందనుకోండి ఒక వైపు వెళితే 4600 నుండి పైన సంఖ్య గల ఇళ్ళు ఉన్నట్టు. ఇంకో వైపు 4500 కంటే తగ్గుతూ పోయే ఇంటి  సంఖ్యలు ఉన్నట్టు.

అమెరికా లోని జార్జియా రాష్ట్ర చిరునామా కోసం ఆ రాష్ట్రం అనుసరించే ప్రమాణాలు, మార్గదర్శకాలు -
http://www.emerycounty.com/addressing/102004-addressguide_draft.pdf

ఈ మధ్యే కొరియాలో  చిరునామా విధానాన్ని మార్చారు. వివరాల కోసం - https://www.youtube.com/watch?v=CkYnR5BFewI

ఇలాంటి ఒక  ప్రామాణికాన్ని తీసుకుని దేశమంతటా అమలు చేస్తే బాగుంటుంది. 

4 comments:

  1. చాలా వివరముగా వ్రాసారు. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
  2. మీ బ్లాగు చాలా బాగుంది 'శ్రీ' గారూ. - వరప్రసాద్ దాసరి (www.dasarigamalu.blogspot.in)

    ReplyDelete
  3. శ్రీ గారు,

    మీ బ్లాగు చాలా ఇన్ఫర్మేటివ్ గా వున్నది. కానీ మీరు ఫ్రీక్వెంట్ గా రాయకపోవటం మాకు డిజప్పాయింట్ గా వున్నది.

    ReplyDelete

Comments