Monday, June 23, 2014

ఆంధ్రప్రదేశ్ - అభివృద్ది నమూనా : ఆపత్కాల సమాచార వ్యవస్థ


ఉపోద్ఘాతం

రాష్ట్రం విడిపోయింది. ప్లస్ లన్నీ తెలంగాణాకి మైనస్ లన్నీ AP కి వేసి వదిలిపెట్టారు కేంద్రం పెద్దలు. అప్పుల్లో ఉదారంగా భాగం ఇచ్చారు.ఆస్థులొచ్చేసరికి మీవి కాదు పొమ్మన్నారు. రాజధాని లేకుండా, CM, మంత్రులు, ఉద్యోగులు ఎక్కడ కూర్చోవాలో తెలియకుండా చివరికి గోచి గుడ్డ మిగిల్చారు. సరే జరిగిందేదో జరిగింది. చంద్రబాబు చెప్పినట్టు కుంగిపోకుండా సమస్యలోనే ఒక అవకాశం చూసి అంతకు మునుపు కంటే ఎక్కువ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. మనకున్న వనరులను, శక్తి సామర్థ్యాలను కూడదీసుకుని ప్రణాళికా బద్దంగా అభివృద్ది చెందవలసిన సమయమిది. 

మన ప్రస్థానం మొదటి నుండి మొదలుపెట్టాల్సి ఉంది. ఈ సమయంలో మంచి అభివృద్ది నమూనా ఎక్కడున్నా అనుసరించి ఒక పధ్ధతి ప్రకారం అభివృద్ది చేస్తే భవిష్యత్ తరాలకి మేలు చేసిన వాళ్లవుతాము. కొన్ని సార్లు ఆలోచిస్తే అసలు మన అధికారులకి, నాయకులకి బుర్ర పని చేస్తోందా అనే అనుమానం కలుగుతుంది.ప్రతి నాయకుడు, అధికారి వేరే దేశానికి ఒక్క సారైనా వెళ్లి ఉంటాడు. అక్కడ పరిసరాలని గమనిస్తే అక్కడ ట్రాఫిక్ క్రమ పద్ధతిలో అంత స్పీడ్ గా  ఎలా వెళ్తోంది ? రోడ్లు గుంటలు లేకుండా ఎలా ఉన్నాయి? మురుగు నీరు కంపు ఎందుకు రావట్లేదు ఇలా ఒక్కొక్క  ప్రశ్న వేసుకున్నా ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికేది. కనీసం కాపీ కొట్టి కూడా నేర్చుకోవడం రాకపోతే ఏమనాలి? పాశ్చాత్యదేశాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అభివృద్ది చెందిన దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో నా దృష్టికి వచ్చిన మంచి  నియమాలు, నిబంధనలు, అలవాట్లు, వ్యవస్థల గురించి పంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఇలాంటివి  మీ దృష్టికి ఏమైనా వస్తే దయచేసి పంపండి. ఈ బ్లాగ్ లో ప్రచురిస్తాను. ఈ సిరీస్ లో మొదటిది - 

ఆపత్కాల సమాచార వ్యవస్థ (Emergency messaging system)

బియాస్ నది దుర్ఘటన - ఇది చాలా దురదృష్టమైన సంఘటన. చిన్న ప్రయత్నం తో వారించతగిన (avoidable) సంఘటన. ఇది జరిగిన కొన్ని రోజులకి అమెరికాలో నేనున్న ప్రదేశం లో వర్షం పడుతోంది. ఆఫీసు నుండి బయలుదేరుతుండగా ఒక మెసేజ్ వచ్చింది. ఇది ఆ మెసేజ్ 


ఈ ఏరియాలో వర్షం వల్ల  అనుకోని వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ప్రాంతాలని వారించండి అని ఆ మెసేజ్ సారాంశం. ఇది ఎక్కడైతే ప్రమాదం ఉందొ ఆ ఏరియా సెల్ టవర్ పరిధి లో ఉన్న అన్ని సెల్ ఫోన్ లకి పంపుతారు. ఎంత సులభమైన పరిష్కారం? 

ఇవ్వాళ దాదాపు ప్రతి ఒక్కరి దగ్గరా సెల్ ఫోన్ ఉంది. చేయాల్సిందల్లా అధికారులు సెల్ ఆపరేటర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందొ ఆ సెల్ టవర్ పరిధిలో ఉన్న సెల్ ఫోన్ లన్నిటికీ మెసేజ్ పంపడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అలాంటి వ్యవస్థ ఉండి ఉంటె 25 నిండు ప్రాణాలు బలైపోయేవి కాదు. కనీసం ప్రమాదం జరిగిన తరువాత అయినా మేలుకుని అన్ని ఆనకట్టల వద్ద ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి నీరు వదిలే ముందు కింద ఒక 10 కిలో మీటర్ల  పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్న సెల్ ఫోన్ లన్నిటికీ ఇలాంటి మెసేజ్ పంపితే చాలా ప్రాణాలు కాపాడొచ్చు. ఇదే కాదు ఇక్కడ పోలీస్లకి దొరకకుండా తప్పించుకున్న వాహనాల నెంబర్ లు లేదా వాహనాలు తస్కరించినా కూడా ఆ చుట్టు పక్కల ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ లకి  మెసేజ్ చేస్తారు, కనిపిస్తే పోలీస్ లకి తెలపమని. 

అధికారులకి తెలిసి ఆనకట్ట గేట్లు ఎత్తారు కాబట్టి ఇలాంటి సంఘటనల్లో ఇలాంటి వ్యవస్థ ఉపకరిస్తుంది. మరి అనుకోకుండా కొండల్లో నుండో, ఉపనదుల నుండో మొన్న ఉత్తరాఖండ్ లో వచ్చిన లాంటి వరదలు వస్తే ? దానికి సులభమైన పరిష్కారం - ఎక్కడైతే అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందో ఉదాహరణకి ఒక ఉప నది ఒక నదిలో కలిసే చోటు నుండి అక్కడక్కడా నీరు ఒక నిర్దేశిత ఎత్తుకు రాగానే నివేదించే ఎలక్ట్రానిక్ పరికరాలు పెట్టి వాటిని సంబంధిత రివర్ అథారిటీ ఆఫీసుకి అనుసంధానిస్తే సరిపోతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కావాల్సిందల్లా పరిష్కారాన్ని అన్వేషించి దాన్ని చిత్త శుద్ధితో అమలు చేయడమే. 

ఉదాహరణకి ఈ లింక్ చూడండి - http://embedded.asti.dost.gov.ph/projects/water-level-monitoring-system/

ఇలాంటి పరిష్కారాలు ఇంజనీరింగ్ విద్యార్థులే అలోచించి ఒక పరికరాన్ని కనుక్కోవచ్చు. చివరికి వెస్ట్రన్ టాయిలెట్స్ ఫ్లష్ లో వాడే టెక్నాలజీ వాడైనా ఒక పరికరం తయారు చేయోచ్చు.మన రాష్ట్రంలోనే కొన్ని వందల సాంకేతిక విద్యా సంస్థలున్నాయి. ప్రతీ కాలేజీ డిపార్టుమెంటు నుండి సంవత్సరానికి ఒక్క సమస్యకి పరిష్కారం కనుగొన్నా మనం టెక్నాలజీ కోసం వేరే దేశాల మీద ఆధారపడే అవసరం ఉండదు. 

సమస్య వచ్చిన ప్రతిసారీ అప్పటికప్పుడు కంటి తుడుపు చర్యలు చేపట్టకుండా శాశ్వత పరిష్కార మార్గాలు అలోచించి బియాస్ నది దగ్గర జరిగింది కాబట్టి అక్కడ మాత్రమె కాకుండా, ఎక్కడ ఇలాంటి పరిస్థితులున్నాయో అన్ని చోట్లా అమలు చేస్తే ఎన్నో ప్రాణాలని కాపాడొచ్చు . 







No comments:

Post a Comment

Comments