Tuesday, May 27, 2014

సంక్షేమ పథకాలు/ఉచిత పథకాలు ఓట్లకి దగ్గర దారులా?

ప్రభుత్వాలన్నీ తమ సంక్షేమ పథకాల గురించి చాలా గొప్పగా వల్లె వేస్తున్నాయి. ఈ పథకాలు అవసరమా? అవసరం అయితే ఎంత వరకు? దానికి ప్రాతిపదిక ఏంటి?

మన రాష్ట్రంలో నేను గమనించినంతవరకు సంక్షేమ/ఉచిత పథకాలు ఓట్లు కొల్లగొట్టే మార్గాలుగా వాడింది మొదట రాజశేఖర్ రెడ్డి.  దాన్ని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రభుత్వాలు ముందుకు తీసుకుని వెళ్ళాయి. ఇప్పుడు పాత వాటిని కొనసాగిస్తూ అంతకు మించిన హామీలతో చంద్రబాబు, కెసిఆర్ ప్రభుత్వాలని ఏర్పాటు చేయబోతున్నారు. 

రాజశేఖర రెడ్డి మొదటి సారి అధికారం లోకి రావడానికి వాడిన బ్రహ్మాస్త్రం రైతులకి ఉచిత విద్యుత్. అప్పటికే వర్షాలు సరిగా లేక చితికిపోయిన రైతులకి అది ఒక అయాచిత వరంగా మారింది. అయితే ఇక్కడ మూడు విషయాలు. 
ఒకటి, ఒక చేత్తో ఉచిత విద్యుత్ ఇస్తూ రెండో చేత్తో నకిలీ ఎరువులు (కడప మాజీ మేయర్ లీలలు లాంటివి), నకిలీ విత్తనాలు కట్టడి చేయకుండా రైతులని ముంచారు. మాది రైతు కుటుంబం. అంతకు మునుపెన్నడూ ఎరువులకోసం, విత్తనాల కోసం లైన్లలో నిలుచుని తీసుకోవడం చూడలేదు. ఎరువుల విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది అయినా, ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సరైన ఎరువులు , విత్తనాలు లేకుండా ఎంత విద్యుత్ ఇచ్చినా లాభం లేదు. 
ఇక రెండోది ఉచిత విద్యుత్ వల్ల బాధ్యత  లేకుండా భూగర్భ జలాలు తోడేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం. 
మూడోది - ఖజానా మీద భారం. రిజర్వేషన్స్ లాగా దీనిని కూడా కనుచూపు మేరలో తీసేసే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే తీసేసే ఆలోచన చేయగానే ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకి గా ముద్ర కొట్టడానికి ప్రతిపక్షాలు, పత్రికలూ సిద్ధంగా ఉంటాయి. 
అయితే కరువుతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుకి ఇది స్వాంతన కలిగించిన్దనటం లో సందేహం లేదు. 

ఇక ఇప్పుడు కొలువుదీరబోతున్న చంద్రబాబు, కెసిఆర్ ఉచిత హామీలకైతే లెక్కే లేదు. ఉదాహరణకి రైతు రుణ మాఫీ. ఇది అధికారం లోకి రావడానికి ఉపయోగపడొచ్చు కానీ వేల కోట్ల ప్రజాధనం ఒక సెక్టార్ ప్రజలకి ఉపయోగించడం తప్పని నా అభిప్రాయం. మా ఊరిలోనే డబ్బు ఉన్నా తక్కువ వడ్డీ అని, ఇన్సూరెన్స్ వస్తుందని వ్యవసాయ రుణాలు తీసుకుని వేరే వాటికి వాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవసరం లేకపోయినా ఋణం తీసుకుని వాడుకున్న వాళ్లకి ఇప్పుడు రుణ మాఫీ చేస్తే ఋణం తీసుకొని/తీసుకోలేని వాడితో పోలిస్తే అయాచితంగా ఒకటో, రెండో, మూడో లక్షలు అయాచితంగా వచ్చినట్లే. దాని వల్ల ఎంత ఆర్ధిక తారతమ్యాలు ఏర్పడతాయి? రిచ్ గెట్స్ రిచర్ అన్నట్లు ఉంటుంది. నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి దాని నుండి బయట పడలేని వాళ్లకి ఇది వరం కాదనను. అయితే ప్రభుత్వం బాధ్యత దానికి గల కారణాలు అన్వేషించి వాటినుండి బయట పడటానికి గల మార్గాలు అన్వేషించాలి. ఉదాహరణకి రైతుకి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం , దళారుల నుండి విముక్తి కలిగించి గిట్టుబాటు ధర అందేలా చూడటం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడానికి గల మార్గాలు శోధించడం,  భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా సాధ్యమైనంత సేంద్రియ ఎరువులు వాడేలా రైతుల్ని చైతన్య పరచటం, రైతులు పండించింది మార్కెటింగ్ చేసుకోవడానికి, ఎగుమతి చేయడానికి సులువైన మార్గాలు సృష్టించడం, నాణ్యమైన ఎరువులు , విత్తనాలు ప్రదేశాలకి తగ్గట్టు అందేలా చర్యలు తీసుకోవడం ,  పండించిన ధాన్యాన్ని తరలించడానికి ప్రతి ఊరికి మంచి రహదారులు వేయడం, వ్యవసాయ ఉత్పత్తులకి విలువను జోడించే పరిశ్రమలని ప్రోత్సహించడం లాంటి దీర్ఘకాలిక ప్రణాలికలపై ఖర్చు పెడితే బాగుంటుంది. 

ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టేది పాలించమని అంతే కాని వాటిని వాడుకొని తను గద్దేనెక్కడానికి కాదు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా, ఎలాంటి పరిమితులు లేకుండా పెట్టె ఇలాంటి పథకాల వల్ల ఒక వర్గపు ప్రజలకి మేలు కలగొచ్చు కానీ సమాజానికి ఏమి మేలు జరగదు. నిన్న ఉచిత విద్యుత్ , ఇవ్వాళ రుణ మాఫీ, రేపు పొద్దున్న డోస్ పెంచాలి కాబట్టి కుటుంబానికి సంవత్సరానికి లక్ష అంటూ మొదలు పెడతారు. వాళ్ళ సొమ్మేం పోయింది. అంతా ప్రజా ధనమే కదా. అలా అని కష్టం వస్తే వదిలేయమనట్లేదు కానీ దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. శాస్త్రీయత ఉండాలి. ప్రజలు కట్టే పన్నులు ఒక వర్గానికి కాకుండా సమాజం మొత్తానికి మేలు చేసే విధంగా దీర్ఘ కాలిక ప్రణాలికలని తయారు చేయాలి. మనకి మిగులు ఉంటె వేరే విషయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఇలాంటి ఉచిత హామీల వల్ల నిజంగా ఖర్చు పెట్టాల్సిన వాటి మీద పెట్టకుండా వెనకపడి పోతాం. 

చివరగా ప్రభుత్వాలు చేపలు ఎలా పట్టాలో నేర్పించాలి కానీ చేపల్ని చేతికి ఇచ్చే సంస్కృతి నుండి బయటపడాలి. Give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime. దానికి ప్రతి పక్షాలు, ప్రజలు సహకరించాలి. 






Sunday, May 25, 2014

మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సే ని పిలవటం పై మీ అభిప్రాయం

మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధ్యక్షులకి ఆహ్వానం పంపడం తెలిసిందే. ఈ విషయం పై తమిళనాడు రాజకీయ పార్టీలు, ప్రజలు రాజపక్సే కి ఆహ్వానం పంపడం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదొక సున్నితమైన అంశం.

స్థూలంగా LTTE ని పూర్తిగా మట్టుపెట్టినందుకు తమిళ ప్రజలకి రాజపక్సే అంటే ద్వేషం (పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువగా) . తమిళులు LTTE కి ఎన్నో విధాలుగా సాయం చేశారు ఈ విషయంలో. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు.  ఇది తప్పు. ఐతే  తమ వాళ్ళని ఊచకోత కోశారు అనే కోపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

శ్రీలంక కోణం నుండి చూస్తె శ్రీలంక లో ఉన్న తమిళులకి హక్కులు నిరాకరించటం తప్పు అయినా అది వారి దేశానికి సంబంధించిన విషయం. అక్కడికి తరలి వెళ్ళిన వారు హక్కులకోసం పోరాడవచ్చు, నిరసన తెలియజేయవచ్చు కానీ సాయుధ పోరాటం చేయటం ముమ్మాటికీ తప్పని నా అభిప్రాయం. అలాగే శ్రీలంక ప్రభుత్వం LTTE తో పాటు పిల్లలతో సహా ఎంతో మంది అమాయకులని మట్టు పెట్టింది. శ్రీలంక కోణంలో అది దేశ రక్షణ కోసం తీసుకున్న చర్య కావొచ్చు కానీ ఆ పేరుతో అమాయకుల ఊచకోత సహించరానిది. 

ఈ భావోద్వేగాల మధ్య నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాలలో ఒకటైన శ్రీలంకకి కూడా ఆహ్వానం పంపింది. తమిళ రాజకీయ పార్టీ లు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. నా దృష్టిలో రెండు వైపులా తప్పులు జరిగాయి. గతాన్ని మర్చిపోయి తోటి దేశాలతో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. అదే సమయం లో తమిళ ప్రజల భావోద్వేగాలని పరిగణన లోకి తీసుకుని వారికి భారత ప్రభుత్వం తన ఆలోచనలని వివరించి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సేని ఆహ్వానించడాన్ని  మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ఎందుకు ?

Wednesday, May 21, 2014

సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుక్కుంటున్న రష్యా

ఉక్రెయిన్ సంక్షోభం, క్రిమియా అనే ద్వీపకల్పాన్ని రష్యా లో కలపడం, దాన్ని జీర్ణించుకోలేని అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించడం తెలిసిందే. 

రష్యా ఉత్పత్తి చేసే సహజ వాయువు (natural gas), 38.7 %  యూరోప్ గ్యాస్ అవసరాలని తీరుస్తోంది. అందులో ఫిన్లాండ్ లాంటి దేశాలు 100% రష్యా గ్యాస్ మీద ఆధారపడ్డాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దేశం జర్మనీ. జర్మనీ 36% గ్యాస్ అవసరాలని రష్యా తీరుస్తోంది. 

ఉక్రెయిన్ సంక్షోభం లో రష్యాని ముద్దాయిని చేసి ఇరుకున పెట్టడానికి పాశ్చాత్య దేశాలన్నీ కలిసి (ముఖ్యంగా అమెరికా) ఈ ఆంక్షల్ని విధించాయి. ఈ ఆంక్షల ప్రకారం పుతిన్ కి దగ్గరైన అధికారులు, సంస్థల మీద వ్యాపార, ఆర్ధిక, ప్రయాణ ఆంక్షలు విధించాయి. అలాగే యూరోప్ రష్యా గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది అంత సులభమైన విషయం కాదు. రష్యా కూడా తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మార్గాలని అన్వేషించింది. ఈ క్రమం లో ఎప్పటినుండో చైనాతో అపరిష్కృతంగా ఉన్న డీల్ తెరపైకి వచ్చింది. ఈ డీల్ ప్రకారం రష్యా వచ్చే 30 ఏళ్ళలో కొత్తగా నిర్మించే పైప్ లైన్ ద్వారా 23,20,000 కోట్లు ($400 బిలియన్)  విలువ గల గ్యాస్ ని చైనా కి సరఫరా చేయబోతోంది. 

ఈ డీల్ రష్యాకి ఆర్థికంగా మేలు చేస్తే, చైనా ఎనర్జీ అవసరాలు తక్కువ ఖర్చుతో తీర్చడానికి ఉపయోగపడింది. అంతకంటే ముఖ్యంగా చైనా, రష్యా ల మధ్య బంధం మరింత బలపడటానికి దోహదం చేసింది. అమెరికా కి ఇంకా మంటేక్కించే విషయం వ్యాపారం డాలర్స్ లో కాకుండా వాళ్ళ సొంత కరెన్సీ లో చేయడం. రష్యా తన వ్యాపారాన్ని భారత్, జపాన్ లతో కూడా పెంపొందించుకోవడానికి పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అమెరికాకి పెద్ద అశనిపాతమే అని చెప్పొచ్చు. అప్పుడు ఆసియా లో అమెరికా ప్రాభవం పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు అమెరికా మోడీ తో సత్సంబందాలకోసం స్నేహ హస్తం చాస్తోంది. అయితే అమెరికా మోడీ విషయం లో ఇంతకుముందు వ్యవహరించిన తీరు వల్ల అది కొంచెం కష్టం కావొచ్చు

మొదట్లో ఈ ఆంక్షలు అమెరికా ద్వేషించే రష్యాకి పెద్ద నష్టంగా విశ్లేషకులు భావించారు.అమెరికా తెలివితో ఒకే రాయితో రెండు పిట్టల్ని కొట్టడానికి చూసింది. మొదటిది రష్యాని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయడం. అదే అదనులో తన గ్యాస్ ని యూరోప్ కి అమ్మడానికి ప్రణాళికల్ని రచించడం. అయితే చివరకి రష్యా కి ఆర్థికంగానూ, దౌత్యపరంగానూ మేలు చేసి అమెరికా తను తీసుకున్న గోతిలో తనే పడింది. సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుక్కున్న రష్యా ఈ ఎపిసోడ్ కి విజేత గా నిలిచింది. 

Friday, May 16, 2014

హలో ... నా బ్లాగు కి స్వాగతం



హలో , బ్లాగ్ మిత్రులందరికీ నమస్కారాలు . నా పేరు శ్రీనివాస్. ఇప్పటి దాకా ఎన్నో విషయాల మీద అభిప్రాయాలని తోటి తెలుగు వారితో పంచుకోవాలనిపించింది కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. 

నాకు సాంకేతిక విజ్ఞానం , రాజకీయాలు చాలా ఇష్టమైనవి. నాకు తెలిసిన విషయాలని, తోటి తెలుగు వారితో పంచుకోవాలనే ఈ చిన్న ప్రయత్నం.

గత కొన్ని సంవత్సరాలుగా కూడలి లో టపాలు చూస్తున్నాను. నల్లమోతు శ్రీధర్ గారి సాంకేతికాలు, శ్యామలీయం గారి పాండిత్యం, స్వేచ్చా సాఫ్ట్వేర్ లపై శ్రీనివాస్ గారి ప్రేమ, మురళి గారి తేట గీతి, జిలేబి గారి చమక్కులు, మనువు , జీవని ఇంకా ఎన్నో చక్కటి బ్లాగులతో అమూల్యమైన సమాచారాన్ని, వినోదాన్ని, విశ్లేషణలని పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు.